హ్యాపీ బర్త్ డే జూనియర్ ఎన్టీఆర్: నవరసాలకు నిలువుటద్దం ఎన్టీఆర్ నట ప్రయాణం
జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు చెబితే అభిమానుల మనసులు ఉప్పొంగుతాయి. ఎన్టీఆర్ స్టెప్పేస్తే థియేటర్లు షేక్ ఐపోతాయి. డైలాగ్ చెబితే టాప్ లేచిపోద్ది. వెండితెర మీద ఎన్టీఆర్ ఎమోషనల్ అయితే ప్రేక్షకుడు కన్నీరు కారుస్తాడు. నటనకు నిలువెత్తు రూపం, నవరసాలను అవలీలగా పలికించే విగ్రహం ఎన్టీఆర్. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా, బాలనటుడిగా విశ్వామిత్రతో మొదలైన ఎన్టీఆర్ సినీ ప్రయాణం, ఆస్కార్ దాకా ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. 1991లో రిలీజైన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా పరిచయమయ్యాడు ఎన్టీఆర్. ఆ తర్వాత బాల రామాయణం సినిమాలో రాముడిగా నటించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు ఎన్టీఆర్.
సింహాద్రి తర్వాత ఫ్లాపుల పరంపర
స్టూడెంట్ నంబర్ వన్, ఆది, సింహాద్రి సినిమాలతో హిట్లు అందుకుని మాస్ హీరోగా మారిపోయాడు ఎన్టీఆర్. అయితే ఏ హీరోకైనా ఒక దశలో ఫ్లాపులు వెంబడిస్తుంటాయి. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ చేసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రభావాన్ని చూపలేకపోయాయి. అప్పుడే యమదొంగ సినిమా వచ్చింది. రాఖీ సినిమా వరకూ లావుగా ఉన్న ఎన్టీఆర్, యమదొంగ సినిమాతో సన్నగా మారిపోయాడు. యమదొంగ సినిమాలో యముడిగా నటించి అందరినీ మెప్పించాడు. ఎన్టీఆర్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచేది అదుర్స్. ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించాడు. అయితే అందరికీ చారి అనే పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది. చారి పాత్ర మాటతీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అదుర్స్ 2 ఉంటుందని గతంలో ఎన్టీఆర్ అన్నారు. మరెప్పుడూ తీస్తారో చూడాలి.
కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో వస్తున్న ఎన్టీఆర్
అదుర్స్ తర్వాత మళ్లీ పెద్ద హిట్ రావడానికి చాలా టైమ్ పట్టింది. ఈసారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ తో హిట్టు కొట్టాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ అవతరానికి అందరూ ఆశ్చర్యపోయారు. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ కథల సెలెక్షన్ చాలా మారిపోయింది. సినిమా సినిమాకు ప్రత్యేకత కనిపిస్తోంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్.. ఇలా ప్రతీ సినిమాతో అందరికీ వినోదం పంచుతున్నాడు. బాలనటుడిగా మొదలెట్టిన ప్రయాణం, ఆర్ఆర్ఆర్ లోని నటనతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్.