Jyothika: జెన్-జీ యువతపై ప్రశంసలు కురిపించిన జ్యోతిక.. విద్యార్థుల ఉద్యమానికి బహిరంగ మద్దతు
ఈ వార్తాకథనం ఏంటి
సమాజంలో మార్పు తీసుకురావడానికి ముందుకొస్తున్న జెన్-జీ యువతను చూసి గర్వంగా ఉందని ప్రముఖ సినీ నటి జ్యోతిక పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశాల నేపథ్యంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేస్తున్న డిమాండ్‌కు తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. తన పోస్టులో జ్యోతిక మాట్లాడుతూ.. ''నేను ఎప్పుడూ విద్యార్థుల పక్షాన ఉంటాను. దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను. బాధ్యతాయుతమైన పాలనకు మద్దతు ఇస్తాను. ప్రజాస్వామ్య విలువలను కాపాడే భారతదేశం కోసం, మెరుగైన విద్యా వ్యవస్థ కోసం నా స్వరం వినిపిస్తాను'' అని పేర్కొన్నారు.
వివరాలు
వారికి ధన్యవాదాలు తెలిపిన జ్యోతిక..
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సేవలను ఆమె ప్రశంసించారు.
''ఒక తల్లిగా నా పిల్లలు కూడా మీలాంటి ధైర్యం, నిజాయితీ, నిబద్ధతతో ఎదగాలని కోరుకుంటున్నాను.
ఎలాంటి భయానికి లొంగకుండా, ముసుగులు లేకుండా పోరాడుతున్న జెన్-జీ యువతను చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
ఐకమత్యంతో ముందుకు సాగితే దేశంలో మార్పు సాధ్యమని మీరు నిరూపించారు.
ఒత్తిడిని తట్టుకుని నిలబడినందుకు, సమాజంలో నెలకొన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు'' అని జ్యోతిక తన సందేశంలో పేర్కొన్నారు.
వివరాలు
విద్యార్థులకు భరోసా..
ఇక నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపడుతున్న ఉద్యమానికి సినీ రంగం నుంచి మద్దతు క్రమంగా పెరుగుతోంది.
ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ సంఘీభావాన్ని ప్రకటించగా, దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా జెన్-జీ యువత చేపట్టిన ఉద్యమం తనకు స్ఫూర్తినిచ్చిందని వెల్లడించారు.
విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లలో న్యాయం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం వారి ఆందోళనలను సానుకూలంగా పరిగణించి, తగిన భరోసా కల్పించాలని సూచించారు. విద్యార్థుల విజయం అంటే దేశ భవిష్యత్తు విజయం అని ఆయన వ్యాఖ్యానించారు.