KA Trailer: ఆసక్తిరంగా.. క ట్రైలర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'క'. ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు.
చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు.
నయన్ సారిక, తన్వి రామ్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న 'క' చిత్రం విడుదలకానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
వివరాలు
యాక్షన్ సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభం
2 నిమిషాలు 45 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ యాక్షన్ సన్నివేశంతో ప్రారంభమవుతుంది.కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరిలో అభినయ వాసుదేవ్ పోస్ట్ మ్యాన్‌గా పనిచేస్తాడు.
మధ్యాహ్నం చీకటి పడే ఆ ఊరికి భౌగోళికంగా ప్రత్యేకత ఉంది. అక్కడ అతడు సత్యభామ అనే అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు.
ఉత్తరాలు పంపించే సమయంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ అనే వ్యక్తి రాసిన ఉత్తరం వాసుదేవ్ జీవితంలో పరివర్తనాన్ని తీసుకొస్తుంది.
ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ను బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఉన్నది ఏమిటి?
వాసుదేవ్‌ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంబడిస్తున్నారు? అనే అంశాలు ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
వివరాలు
విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు
ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో 'క' ట్రైలర్ ఆరంభం నుండి ముగింపు వరకు ఆకట్టుకునే విధంగా ఉంది.
కిరణ్ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు సినిమా మీద అంచనాలను పెంచాయి.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
కిరణ్ అబ్బవరం నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.