
ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని ఏర్పాటు చేసుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. విలన్ పాత్రలతో మెప్పించి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి, కామెడీ పాత్రల్లోనూ తనదైన ముద్ర కనబర్చిన నటుడు కైకాల.
సిపాయి కూతురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కైకాల, మొదట్లో ఎన్టీఆర్ కు డూప్ గా ఎక్కువగా నటించారు. ఎన్టీఆర్ పోలికలతో ఉండేవారు కాబట్టి ఎన్టీఆర్ సరసన ఎక్కువగా చేసారు.
ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణల మధ్య మంచి అనుబంధం ఉండేది. వీరిద్దరూ కలిసి దాదాపు 100 సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తో నటించిన అగ్గిపిడుగు సినిమాతో కైకాల సినిమా జీవితం మలుపు తిరిగింది.
ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. యముడిగా ఆయన చేసిన సినిమాలన్నీ విజయవంతం అయ్యాయి.
కైకాల సత్యనారాయణ
రాజకీయ జీవితం
1996లో రాజకీయ రంగప్రవేశం చేసిన కైకాల, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. మచిలీ పట్నం నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండేళ్ళకు 1998లో కావూరి సాంబశివరావుపై ఓడిపోయారు.
తర్వాత మళ్లీ రాజకీయాల జోలికి వెళ్ళలేదు. ఆయన తన జీవితంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. సినీ వినీలాకాశంలో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగారు.
2012లో 59వ జాతీయ అవార్డుల కోసం దక్షిణ భారత సినిమాలకు జ్యూరీ మెంబర్ గా తన సేవలను అందించారు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు.
కొడుకులు కూడా సినిమా రంగంలో ఉన్నారు. 60ఏళ్ళు సినిమా ప్రయాణం చేసి తెలుగు ప్రేక్షకులను ఎన్నో జ్ఞాపకాలను అందించి, 87ఏళ్ల వయసులో పరమపదించారు.