Kamal Haasan: ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ స్ట్రాంగ్ కౌంటర్.. ప్రశంసించిన కంగనా!
ఈ వార్తాకథనం ఏంటి
స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 'భారత ప్రధాన మంత్రి అంబానీ గారూ..' అంటూ మస్క్ వ్యంగ్యంగా సంబోధించడంపై నటుడు, ఎంపీ కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ చేసిన పోస్టును మరో ఎంపీ, నటి కంగనా రనౌత్ రీషేర్ చేస్తూ ఆయనకు మద్దతు తెలిపారు. మస్క్‌కు కమల్ హాసన్ సరైన సమాధానం ఇచ్చారంటూ ప్రశంసించారు.
వివరాలు
బిలియనీర్లు దేశ విధానాలను శాసించకూడదు: కమల్ హాసన్
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఏ బిలియనీర్ అయినా.. అతడు భారతీయుడైనా, అమెరికన్ అయినా.. ఒక దేశ విధానాలను శాసించకూడదని స్పష్టం చేశారు.
ప్రతి దేశం తన సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
తమ దేశాల్లో రక్షణాత్మక విధానాలను అనుసరిస్తూనే స్వేచ్ఛా వాణిజ్యం గురించి పశ్చిమ దేశాలు ఇతరులకు హితబోధ చేయడం సరైన పద్ధతి కాదని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.
అమెరికా తన దేశీయ పరిశ్రమను కాపాడుకునేందుకు చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీలు) 100 శాతం సుంకాలు విధించిందని గుర్తుచేశారు.
వివరాలు
వలస పాలనలో ఉన్న దేశం కాదు
అదే విధంగా భారత్ కూడా తన దేశీయ తయారీ రంగాన్ని పరిరక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు.
భారత్ ప్రజాస్వామ్య దేశమని, వలస పాలనలో ఉన్న దేశం కాదని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాలను భారత్ ఎప్పుడూ స్వాగతిస్తుందని, అయితే తమ దేశ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు భారతీయులకే ఉంటుందని తేల్చిచెప్పారు.
పశ్చిమ దేశాల ప్రయోజనాలను, బిలియనీర్ల ద్వంద్వ వైఖరిని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని తన పోస్టులో పేర్కొన్నారు.
వివరాలు
కమల్ హాసన్‌కు కంగనా మద్దతు
కమల్ హాసన్ చేసిన ఈ పోస్టుపై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ సరైన సమాధానం ఇచ్చారని ప్రశంసించారు.
ఆయన పోస్ట్ మస్క్‌కు బాధ కలిగించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఏ బిలియనీర్‌కైనా ఒక దేశ విధానాలను నిర్దేశించే హక్కు ఉండదనే విషయాన్ని కమల్ హాసన్ చక్కగా వివరించారని కంగనా పేర్కొన్నారు.
ఆయన ఇచ్చిన కౌంటర్ సూటిగా, స్పష్టంగా ఉందని కొనియాడారు. దీంతో ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు, కమల్ హాసన్ స్పందన, కంగనా రనౌత్ మద్దతు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.