కాంతార: వరాహరూపం పాటను తీసేయాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు
కన్నడ మూవీ కాంతార సినిమాలోని వరాహరూపం పాటపై కేరళ హైకోర్టు విధించిన కండీషన్ నుండి ఉపశమనం కలిగింది సుప్రీం కోర్ట్. దీంతో చిత్ర నిర్మాతలకు కాంతార సినిమాలో వరాహ రూపం పాటను తీసేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతేకాదు, చిత్రనిర్మాత విజయ్ కిరగందూర్, దర్శక హీరో రిషబ్ శెట్టిలను ఈ విషయంలో అరెస్ట్ చేయరాదని, కావాలంటే వాళ్ళను ప్రశ్నలు అడగవచ్చని, కాపీరైట్ కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం, ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో కోర్టు ముందుకు పిటీషనర్ హాజరు కావాలని తెలియజేసింది. ప్రస్తుతానికైతే పాటను సినిమాలోంచి తీసేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
వరాహరూపం పాట వివాదం ఏమిటి?
చిన్న సినిమాగా రిలీజైన కాంతార, పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టింది. 450కోట్లకు పైగా వసూళ్ళను బాక్సాఫీసు దగ్గర నమోదు చేసింది. ఐతే ఈ సినమా క్లైమాక్స్ లో వచ్చే వరాహరూపం పాటను, తమ దగ్గరి నుండి కాపీ చేసారని తైకుదమ్ బ్రిడ్జ్ వాళ్ళు, సినిమా దర్శకుడి మీద, నిర్మాత మీద కేసు వేసారు. నవరసం పాటకు కొన్ని మార్పులు చేసి వరహరూపం పాటకు ఉపయోగించుకున్నారని తైకుదమ్ బ్రిడ్జ్ వాళ్ళు ఆరోపించారు. దీంతో వరాహరూపం పాటను సినిమాలోంచి తీసివేయాలని, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోంచి కూడా తీసేయాలని చిత్ర నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది కేరళ హైకోర్టు. ప్రస్తుతం సుప్రీంకోర్ట్, పాటను తీసేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.