
కరాటే కళ్యాణికి పెద్ద చిక్కు: సస్పెండ్ చేసిన మా అసోసియేషన్
ఈ వార్తాకథనం ఏంటి
కరాటే కళ్యాణిపై మా అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయాన్ని మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రఘుబాబు వెల్లడి చేసారు.
మా అసోసియేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కరాటే కళ్యాణికి మే 16వ తేదీన షోకాజ్ నోటీసులను అందజేసింది.
అయితే ఆ నోటీసులపై ఇప్పటివరకూ ఎలాంటి వివరణ రాకపోవడంతో, కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసారు.
మా అసోసియేషన్ కోసం రూపొందించుకున్న ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా కరాటే కళ్యాణి ప్రవర్తించారని, అందువల్లే ఆమెను సస్పెండ్ చేసారని సస్పెన్షన్ లేఖలో వెల్లడి చేసారు.
గత కొన్ని రోజులుగా, శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆమె పోరాడుతోంది.
Details
ఖమ్మంలో 54అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న 54అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహలు జరుగుతుండగా, దేవుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సరికాదని ఆమె మాట్లాడింది.
అంతేకాదు దేవుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది, దేవుడిని పూజించే వారి మనోభావాలను దెబ్బతీసినట్టేనని, ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే కూల్చివేయాలని యాదవ సంఘాలతో కలిసి ఆమె పోరాటం చేస్తోంది.
అయితే ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను, మే 16వ తేదీన షోకాజ్ నోటీసులు విడుదల చేసి, వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది.
కరాటే కళ్యాణి నుండి ఎలాంటి వివరణ రాకపోయేసరికి మా అసోసియేషన్ నుండి ఆమెను సప్సెండ్ చేస్తున్నట్లు వెల్లడి చేసారు.