కేరళ ఫిలిమ్ ఛాంబర్: ఇక నుండి 42రోజుల తర్వాతే ఓటీటీలో సినిమా విడుదల
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక జనాలు థియేటర్ కి రావడం చాలా వరకు తగ్గించారు. ఏదైనా పెద్ద సినిమా ఉంటే తప్ప థియేటర్ వైపు చూడటం లేదు. ఇళ్ళలోంచి కదలకుండా చేతికి దొరికిన సాధనంతో సినిమాలు చూసేస్తున్నారు. ఐతే జనాలు థియేటర్లోకి రాకపోవడానికి అదొక్కటే కారణం కాదు. థియేటర్లలో రిలీజైన సినిమా, చాలా తొందరగా ఓటీటీలోకి రావడం కూడా మరో కారణం. కొన్నిరోజులు ఆగితే ఇంట్లోనే చూడొచ్చులే అన్న ఆలోచన, జనాలను థియేటర్ వైపు వెళ్ళనివ్వడం లేదు. ఆ పరిస్థితిని మార్చడానికి కేరళ ఫిలిమ్ చాంబర్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమాలేవైనా థియేటర్లోకి వచ్చిన 42రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ కావాలని కొత్త కండీషన్ తీసుకొచ్చింది.
2022లో 325కోట్లు నష్టపోయిన ఫిలిమ్ మేకర్స్
2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని కేరళ ఫిలిమ్ ఛాంబర్ పేర్కొంది. ఈ నిబంధనలు మళయాలం సినిమాలకే కాదు, కేరళలో రిలీజ్ అయ్యే ఇతర భాషల సినిమాలకు కూడా వర్తిస్తుందని తెలిపింది. ఈ విషయమై ఇంటర్నెట్ లో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. 2022లో మళయాలంలో 176సినిమాలు రిలీజ్ అయ్యాయట. వాటిల్లో కేవలం 17 సినిమాలు మాత్రమే నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చాయట. 2022లో మొత్తం 325కోట్ల రూపాయల నష్టం నిర్మాతలకి వచ్చిందట. అందుకే థియేటర్ కి వచ్చే జనాలను పెంచడానికి కేరళ ఫిలిమ్ ఛాంబర్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి నిర్ణయమే ఇతర ఇండస్ట్రీలు తీసుకుంటే బాగుంటుందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.