The Kerala Story 2: 'ది కేరళ స్టోరీ 2'విడుదలపై స్టే.. సెన్సార్ బోర్డుకు కోర్టు ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా విడుదలకు కేవలం ఒకరోజు మాత్రమే మిగిలి ఉండగా 'ది కేరళ స్టోరీ 2' చిత్రానికి న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రచార వీడియోల్లో కేరళ రాష్ట్రాన్ని తప్పుడు రీతిలో చూపించారని,కొన్ని సన్నివేశాలు మతపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశముందని సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను నిలిపివేయాలని, అలాగే సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)వ్యవహరించిన తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సినిమాను మళ్లీ సమగ్రంగా పరిశీలించాలని జస్టిస్ కురియన్ థామస్ సీబీఎఫ్‌సీకి ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు
2023లో పలు వివాదాల మధ్య విడుదలైన 'ది కేరళ స్టోరీ'
అంతవరకు చిత్రం విడుదలపై తాత్కాలిక స్టే విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఇది 2023లో పలు వివాదాల మధ్య విడుదలైన 'ది కేరళ స్టోరీ' చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కింది. ఈ సీక్వెల్‌కు కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ పేరుతో మోసపోయిన కొందరు యువతుల జీవితాల చుట్టూ కథ సాగుతుంది.
వివరాలు
హైకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వుల నేపథ్యంలో.. విడుదల తాత్కాలికంగా వాయిదా
ప్రేమలో పడిన వారు కుటుంబాన్ని ఎదిరించి ప్రియుడే తమ ప్రపంచమని నమ్మి వెళ్లిపోతారు. కానీ కాలక్రమేణా ఆ ప్రేమ ఒక మాయమాటగా, పెద్ద మోసంగా మారిందని గ్రహిస్తారు. ఆ తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు, బయట చెప్పుకోలేని వేధింపులు, దారుణ అనుభవాల మధ్య వారు పడే మనస్థితిని ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' పేరుతో రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే కేరళ హైకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వుల నేపథ్యంలో విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది.