
కేజీఎఫ్ వివాదం: వెంకటేష్ మహా మాటలకు నవ్విన డైరెక్టర్ సారీతో వచ్చాడు
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల్లో మహిళా పాత్రల గురించి సాగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, బీవీ నందినీ రెడ్డి, శివ నిర్వాణ, వెంకటేష్ మహా, వివేక్ ఆత్రేయ పాల్గొన్నారు.
ఇక్కడ కమర్షియల్ సినిమా గురించీ, కేజీఎఫ్ సినిమా గురించి వెంకటేష్ మహా మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. కేజీఎఫ్ సినిమాలోని రాఖీ భాయ్ పాత్రను నీచ్ కమీన్ కుత్తే అని తిట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ విషయంలో వెంకటేష్ మహా మీద సినిమా అభిమానులందరూ నిప్పులు చెరుగుతున్నారు. వరుస పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. వెంకటేష్ మహా, కేజీఎఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న వివేక్ ఆత్రేయ, ఇంకా మిగతా దర్శకులు విపరీతంగా నవ్వారు. ఆ నవ్వే వాళ్ళను ట్రోలింగ్ లోకి లాగింది.
కేజీఎఫ్
కించపర్చడం ఉద్దేశ్యం కాదంటున్న వివేక్ ఆత్రేయ
వెంకటేష్ మహా మాట్లాడిన మాటలకు పగలబడి నవ్విన వాళ్ళలో వివేక్ ఆత్రేయ కూడా ఒకరు. దాంతో, అతని పై కూడా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
ఆ ట్రోలింగ్ దెబ్బకు సారీ అంటూ వచ్చాడు వివేక్ ఆత్రేయ. గంటల కొద్దీ జరుగుతున్న చర్చలో, ఒకానొక సందర్భంలో అవతలి వారు మాట్లాడిన మాటలకు నా ప్రతిస్పందన మీకు అభ్యంతరకరంగా ఉండొచ్చని, కాకపోతే అది తను ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదనీ, సినిమా ఏదైనా, దాన్ని తీసిన వాళ్ళను కించపర్చాలన్న ఉద్దేశ్యం తనకు లేదనీ వివేక్ ఆత్రేయ చెప్పుకొచ్చాడు.
తన ప్రతిస్పందన అవతలి వారిని కించపర్చినట్లుగా అనిపిస్తే సారీ చెబుతున్నానని ఇన్ స్ట్రా గ్రామ్ వేదికగా తెలియజేసాడు వివేక్ ఆత్రేయ.