K-Ramp: కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్' ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ హీరో 'కిరణ్ అబ్బవరం' నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కే ర్యాంప్'(K-Ramp)ఓటిటిలోకి రానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో విజయవంతమైన రన్ తర్వాత, తాజాగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం నవంబర్ 15న ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' (Aha) లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించగా, సాయికుమార్, నరేశ్ వి.కె., కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రల్లో కనిపించారు.
Details
కథ ఏమిటంటే
కుమార్ (కిరణ్ అబ్బవరం) పుట్టుకతోనే ధనవంతుడు. తండ్రి కృష్ణ(సాయికుమార్)అతడిని అత్యంత ప్రేమతో పెంచుతాడు, కావలసిన ప్రతిదీ అందిస్తాడు. అయితే కుమార్‌కి చదువుపై ఆసక్తి ఉండదు. స్నేహితులతో టైమ్‌పాస్ చేస్తూ, మద్యం సేవించడం అలవాటైపోతుంది. కుమార్ జీవితాన్ని సరైన దారిలో పెట్టాలనే ఉద్దేశంతో అతన్ని తండ్రి కేరళలోని ఒక కాలేజీలో చేర్పిస్తాడు. అక్కడ అతడు మెర్సీ జాయ్(యుక్తి తరేజా)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. కానీ మెర్సీకి ఒక 'మానసిక సమస్య' ఉంటుంది. ఆ సమస్య ఏమిటి? దాని వల్ల కుమార్-మెర్సీ ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. మొత్తంగా 'కే ర్యాంప్' హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.