Kumari Aunty: కుమారి ఆంటీ డబుల్ ధమాకా.. సినిమాలో నటన.. ఫుడ్‌పై రూ.100 డిస్కౌంట్ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ వీధుల్లో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ విక్రయిస్తూ సోషల్ మీడియాలో అనూహ్యమైన గుర్తింపు సంపాదించుకున్న కుమారి ఆంటీ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తన ప్రత్యేకమైన మాటతీరు, కస్టమర్లను ఆప్యాయంగా పలకరించే విధానంతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. 'పాంచాలి పంచభర్తృక' చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రకటించిన వినూత్న ఆఫర్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సినిమా టికెట్ చూపించిన వారికి తన ఫుడ్ స్టాల్‌లోని బిల్లుపై రూ.100 డిస్కౌంట్ ఇస్తానని ఆమె ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 'పాంచాలి పంచభర్తృక' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న కుమారి ఆంటీ ఈ ఆఫర్‌ను వెల్లడించారు.
వివరాలు
భోజనం బిల్లులో రూ.100 తగ్గింపు
సినిమాను థియేటర్‌లో చూసిన తర్వాత ఆ టికెట్‌ను తన ఫుడ్ కౌంటర్‌కు తీసుకొస్తే భోజనం బిల్లులో రూ.100 తగ్గిస్తానని తెలిపారు.
ప్రతి ఒక్కరూ సినిమాను థియేటర్లలో వీక్షించి ఆదరించాలని ఆమె కోరారు. ఈ ఆఫర్‌తో ఒకవైపు సినిమాకు ప్రచారం లభించడంతో పాటు, మరోవైపు తన ఫుడ్ వ్యాపారానికీ ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
కుమారి ఆంటీ ప్రకటించిన ఈ ఆఫర్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
ఆమె మార్కెటింగ్ ఆలోచనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి కుమారి ఆంటీ భావోద్వేగంగా మాట్లాడారు.
వివరాలు
సోషల్ మీడియా కారణంగానే అరుదైన అవకాశం
తాను సినిమాల్లో నటిస్తానని కలలో కూడా ఊహించలేదని, సోషల్ మీడియా కారణంగానే తనకు ఈ అరుదైన అవకాశం దక్కిందని చెప్పారు.
'పాంచాలి పంచభర్తృక'లో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు గంగ సప్తశిఖర, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు. సీనియర్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పాంచాలి పంచభర్తృక' చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తున్నారు.
రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వివరాలు
ఇవాళ రిలీజ్
రోల్ రైడా, జెమినీ సురేశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 'పాంచాలి పంచభర్తృక' నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో కుమారి ఆంటీకి ఉన్న క్రేజ్‌కు తోడు.. ఆమె ప్రకటించిన ఈ వినూత్న ఆఫర్ కూడా సినిమాకు అదనపు ప్రచారం తీసుకొస్తుండటంతో చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది.