Bharathiraja: 'సీతాకోకచిలుక' దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ పరిశ్రమలో గ్రామీణ కథలకు కొత్త ఊపిరి పోసి, పల్లెటూరి జీవన విధానాన్ని వెండితెరపై సహజంగా ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు, "దర్శక ఇమయం" భారతీరాజా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించిన భారతీరాజా మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
వివరాలు
తొలి సినిమాతోనే సంచలనం
1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా, 1977లో విడుదలైన '16 వయతినిలే' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన ప్రత్యేకతను చాటుకున్న ఆయన, అప్పటివరకు స్టూడియోలకు పరిమితమైన చిత్రీకరణను పల్లెలకు తీసుకెళ్లి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ జీవితం, అక్కడి మనుషుల భావోద్వేగాలు, సంస్కృతి, ప్రకృతి అందాలను సహజంగా చూపిస్తూ తమిళ సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఈ క్రమంలోనే అభిమానులు, సినీ వర్గాలు ఆయనను గౌరవంగా "దర్శక ఇమయం"గా కొనియాడాయి. ఆయన తెరకెక్కించిన 'సిగప్పు రోజక్కల్', 'కిజక్కే పోగుం రైల్', 'అలైగల్ ఓయ్వతిల్లై', 'ముదల్ మరియాదై', 'కరుత్తమ్మ' వంటి చిత్రాలు సినీ చరిత్రలో క్లాసిక్‌లుగా నిలిచాయి.
వివరాలు
తెలుగుతో ప్రత్యేక అనుబంధం
భారతీరాజా ప్రతిభ తమిళానికే పరిమితం కాలేదు. తెలుగు, హిందీ భాషల్లోనూ ఆయన తన ముద్ర వేశారు. ఆయన దర్శకత్వం వహించిన 'సీతాకోకచిలుక' చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకోగా, భారతీరాజాకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా లభించింది. అంతేకాదు, నందమూరి బాలకృష్ణ నటించిన ఘనవిజయ చిత్రం 'మంగమ్మగారి మనవడు'కు కథ అందించిన ఘనత కూడా ఆయనదే. అలాగే రాజశేఖర్ నటించిన 'పల్నాటి పౌరుషం' చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చారు. రాధా, రాధికా, రేవతి, కార్తీక్ వంటి పలువురు ప్రముఖ నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడిగా భారతీరాజా ప్రత్యేక గుర్తింపు పొందారు.
వివరాలు
పద్మశ్రీతో పాటు ఎన్నో పురస్కారాలు
భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2004లో 'పద్మశ్రీ' పురస్కారంతో సత్కరించింది. తన సినీ జీవితంలో ఆరు జాతీయ పురస్కారాలు,నాలుగు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు సహా అనేక గౌరవాలను అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ తన ప్రతిభను చాటిన భారతీరాజా,'ఆయుధ ఎళుత్తు' (యువ), 'పాండియా నాడు' (పల్నాడు), 'తిరుచిత్రంబలం' (తిరు) వంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గ్రామీణ సంస్కృతిని, పల్లె మనుషుల జీవితాలను భారతీయ సినిమాకు కొత్త కోణంలో పరిచయం చేసిన మహోన్నత దర్శకుడి మరణంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భారతీరాజా సృష్టించిన చిత్రాలు, ఆయన చూపించిన సినీ మార్గం తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోనున్నాయి.