సినిమాల్లో హీరోగా ధోనీ: అలాంటి కథతో వస్తామంటున్న సాక్షి సింగ్
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్ ఐపీఎల్ లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అటు ఐపీఎల్ లో ఆడుతూనే సినిమాల్లోకి ధోనీ ఎంట్రీ ఇస్తున్నాడు. నటుడిగా కాదు నిర్మాతగా. ధోనీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ను స్థాపించిన కెప్టెన్ కూల్, తమిళంలో LGM(లెట్స్ గెట్ మ్యారీడ్) అనే సినిమాను తెరకెక్కించారు. ధోనీ ఎంటర్ టైన్మెంట్స్ బాధ్యతలన్నీ ధోనీ భార్య సాక్షి సింగ్ ధోనీ చూసుకుంటున్నారు. LGM సినిమాను తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు మీడియాతో నిర్మాత సాక్షి సింగ్ ధోనీ ముచ్చటించారు.
సందేశాత్మక సినిమాల్లో ధోనీ
తనకు పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ అంటే అభిమానమని, యూట్యూబ్ లో అల్లు అర్జున్ సినిమాలన్నీ చూసాననీ సాక్షి సింగ్ ధోనీ చెప్పుకొచ్చారు. అలాగే ప్రభాస్, మహేష్ బాబులతో సినిమాలు తీస్తారా అన్న ప్రశ్నలకు, నేనిప్పుడే సినిమాల్లోకి ఎంటర్ అయ్యాను, వాళ్ళందరూ పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ తీసుకునే స్టార్లనీ ఆమె అన్నారు. హీరోగా ధోనీ నటించే అవకాశం ఉందా అని మరో విలేకరి అడగ్గా, ధోనీకి యాక్షన్ సినిమాలంటే ఇష్టమనీ, యాక్షన్ తో కూడుకున్న సందేశాత్మక కథలు వస్తే ధోనీ నటిస్తారని సాక్షి సింగ్ అన్నారు. LGM సినిమాలో హరిష్ కళ్యాణ్, ఇవానా హీరోహీరోయిన్లుగా నటిస్తారు. రమేష్ తమిళ్మని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, జులై 28న రిలీజ్ అవుతుంది.