Mahesh Babu: 50వ వసంతంలో మహేశ్ బాబు.. ఆయన జీవితంలోని ఆసక్తికర విషయాలు మీకోసం!
ఈ వార్తాకథనం ఏంటి
వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అంటారు. అందుకే ఏటా మరింత హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తూ టాలీవుడ్ 'ప్రిన్స్'గా అభిమానులను అలరిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడిచినా.. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా గతంలో మహేశ్ బాబు పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే.. చిన్నప్పుడు అందరి పిల్లల్లాగే చాలా సాదాసీదాగా ఉండేవాడిని. అందరిలాగే నేనూ ఆటోలోనే స్కూల్‌కు వెళ్లేవాడిని. నేను బాలనటుడిగా సినిమాల్లో నటించాననే విషయం చెన్నైలో చాలామందికి తెలియదు. అలా తెలియకపోవడమే మంచిదైంది. అందరితో కలిసి సాధారణంగా పెరిగే అవకాశం నాకు దక్కింది.
వివరాలు
డేటింగ్ పై ఆసక్తి లేదన్న మహేష్ బాబు..
డేటింగ్‌పై తనకు పెద్దగా ఆసక్తి లేదని మహేశ్ బాబు చెప్పారు. ఒకవేళ లాస్ ఏంజిల్స్‌లో మూడు గంటలపాటు ఎవరినైనా డిన్నర్ డేట్‌కు తీసుకెళ్లాల్సి వస్తే హాలీవుడ్ స్టార్ డెమీ మూర్‌ను తీసుకెళ్తానని సరదాగా చెప్పారు.
తాను ఫుడ్ లవర్‌నని, తనకు ఇష్టమైన హాలిడే స్పాట్ దుబాయ్ అని మహేశ్ వెల్లడించారు.
తనకు అసలు కోపం రాదని.. ఒకవేళ వచ్చినా ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండదని చెప్పారు. ఇల్లు బాగుంటే మనం కూడా బాగుంటామని నమ్ముతానని మహేశ్ అన్నారు.
ఇంటి విషయాలన్నింటినీ నమ్రత చూసుకుంటారని తెలిపారు.
తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించడానికి నాలుగేళ్లు పట్టిందని, నమ్రత లేకపోతే తాను లేనని మహేశ్ బాబు తన భార్యపై ఉన్న ప్రేమను వెల్లడించారు.
వివరాలు
జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు చాలా అవసరం..
తమ కుమారుడు గౌతమ్‌కు సినిమాలంటే ఆసక్తి ఉందని మహేశ్ చెప్పారు.
అయితే సినీ పరిశ్రమలోకి రావాలా వద్దా అనేది పూర్తిగా అతని ఇష్టమేనని అన్నారు.
ఇక కుమార్తె సితారను సైంటిస్ట్‌గా చూడాలని తనకు ఉందని, అయితే పెద్దయ్యాక ఏం కావాలనేది ఆమె ఇష్టమేనని చెప్పారు.
షూటింగ్ లేనప్పుడు తప్పకుండా పిల్లలతోనే సమయం గడుపుతానని మహేశ్ తెలిపారు.
వారితో ఉంటే ఒత్తిడంతా మర్చిపోతానని చెప్పారు. గౌతమ్ గుడ్ బాయ్ అని, సితార మాత్రం నాటీ గర్ల్ అని సరదాగా అన్నారు.
జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు చాలా అవసరమని మహేశ్ అభిప్రాయపడ్డారు. అందుకే డబ్బు సంపాదించడానికి కష్టపడాలని చెప్పారు.
వివరాలు
సినిమాల గురించి మహేశ్ ఏమన్నారంటే..
ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదని.. ఎంత మంచి సినిమాలు చేశామన్నదే ముఖ్యమని మహేశ్ బాబు అన్నారు.
అన్ని సందర్భాల్లోనూ ప్రయోగాలు చేయడం సాధ్యం కాదని చెప్పారు.
వందల కోట్ల రూపాయలతో సినిమా నిర్మిస్తున్నప్పుడు అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
కథలో కొత్తదనం ఉండాలని, లేదంటే బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉంటుందని అన్నారు.
తన గొంతు తన తండ్రి కృష్ణ వాయిస్‌లా ఉంటుందని కొందరు చెబుతుంటారని, అలా విన్నప్పుడు తనకు చాలా ఆనందంగా ఉంటుందని మహేశ్ చెప్పారు.
తన తండ్రి నటించిన ప్రతి సినిమాను చూశానని.. 'ఈనాడు' సినిమాను ఏకంగా పదిసార్లు చూశానని తెలిపారు.
వివరాలు
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి మల్టీస్టారర్..
ఒకసారి షూటింగ్ ప్రారంభించిన తర్వాత స్క్రిప్ట్ విషయంలో చర్చలు ఉండకూడదని మహేశ్ అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో గతంలో తాను కొన్ని పొరపాట్లు చేశానని కూడా వెల్లడించారు.
మంచి కథ దొరికితే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మహేశ్ బాబు చెప్పారు.