Mammootty: అనారోగ్యంపై తొలిసారి స్పందించిన మలయాళ స్టార్ మమ్ముట్టి
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడు మమ్ముట్టి పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. స్వల్ప ఆరోగ్య సమస్య కారణంగా కొంతకాలం నటనకు దూరంగా ఉన్న ఆయన, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి మాట్లాడారు. ఆ సమయంలో తాను రుచి, వాసన కోల్పోయానని వెల్లడించారు. ఈ సందర్భంగా మమ్ముట్టి మాట్లాడుతూ,మనిషికి కంటిచూపు,వినికిడి ఎంత ముఖ్యమో అలాగే శ్వాస తీసుకునేటప్పుడు వాసన అనుభూతి కూడా అంతే అవసరమని అన్నారు. ఊపిరి పీల్చుకున్నా ఏ వాసన రాకపోతే లోపల భయం కలుగుతుందని,ఆ అనుభవాన్ని తాను ఎదుర్కొన్నానని చెప్పారు. చాలా కాలం పాటు రుచి, వాసన అనుభూతులు లేక ఇబ్బంది పడ్డానని,ఇప్పుడు మాత్రం నెమ్మదిగా అవి తిరిగి వస్తున్నాయని తెలిపారు.
వివరాలు
గతేడాది జూన్‌లో అనారోగ్యానికి గురైన మమ్ముట్టి
ఏదైనా కోల్పోయినప్పుడే దాని విలువ మనకు నిజంగా అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మనం వినగలుగుతున్నందువల్లే ఎదుటివారిని నెమ్మదిగా మాట్లాడమని అడుగుతామని,వినలేని వారికి ఎలా మాట్లాడినా తేడా తెలియదని, వినగలగడం కూడా దేవుడిచ్చిన వరమేనని ఆయన అన్నారు. మమ్ముట్టికి అసలు ఏమైంది అనే విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా,గతేడాది జూన్‌లో ఆయన అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. దాదాపు నాలుగు నెలల పాటు ఆయన విరామం తీసుకున్నారు. ఆరోగ్యం పూర్తిగా సరిగా లేదన్నది నిజమే అయినప్పటికీ,అది పెద్ద సమస్య కాదని అప్పట్లో ఆయన టీమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం మమ్ముట్టి'పేట్రియాట్'చిత్రంలో నటిస్తున్నారు. ఈసినిమాకు మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా,ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.