Mana ShankaraVaraprasad Garu: 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ డేట్ ఫిక్స్… ప్రమోషన్లకు నయనతార గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా అభిమానులారా... సంబరాలకు సిద్ధమవ్వండి. ఇప్పటివరకు మీరు చూడని సరికొత్త చిరంజీవిని (Chiranjeevi) వెండితెరపై చూసే అవకాశం రాబోతోంది. తన సినిమాలో చిరు అవతారం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్‌గారు' ఇప్పటికే భారీ అంచనాలు రేపుతోంది. ఈ చిత్రంలో నయనతార (Nayanthara) కథానాయికగా నటిస్తుండగా, వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. తాజాగా మూవీ టీమ్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. జనవరి 4న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.
Details
రూల్స్ బ్రేక్ చేసిన నయనతార
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో చిరంజీవి ఫుల్ యాక్షన్ మోడ్‌లో దర్శనమిచ్చారు. మోకాలిపై కూర్చొని తుపాకీ పేలుస్తున్న చిరు స్టిల్ అభిమానులను విజిల్స్ వేయించేలా ఉంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో దుమ్మురేపడం ఖాయమనేలా పోస్టర్ సూచిస్తోంది. అగ్ర కథానాయిక నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రొఫెషనల్ విషయాల్లో ఆమెకు ఉన్న క్రమశిక్షణ అందరికీ తెలిసిందే. ఏ సినిమా ఒప్పుకున్నా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాను అని ముందే స్పష్టంగా చెబుతారని టాక్. గత కొంతకాలంగా ఆమె నటించిన సినిమాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
Details
వీడియో వైరల్
చాలా అరుదుగా, అది కూడా భర్త విఘ్నేశ్ శివన్ కోసం ఒకట్రెండు సార్లు మాత్రమే ఆమె ప్రమోషన్లకు వచ్చారు. తాను హీరోయిన్‌గా చేసిన అనేక సినిమాలకు ఆమె ప్రచారాలకు రాలేదు. అయితే ఇప్పుడు 'మన శంకర వరప్రసాద్ గారు' కోసం ఆ రూల్‌ని నయనతార బ్రేక్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నయనతార స్వయంగా వచ్చి మూవీ ప్రమోషన్ల గురించి దర్శకుడు అనిల్ రావిపూడిని అడగడం, ఆయన షాక్ అయ్యి కళ్లు తిరిగి పడిపోవడం నవ్వులు పూయిస్తోంది. ఇదివరకే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు వెంకటేశ్‌తో రీల్స్ చేయించిన అనిల్ రావిపూడి... నయనతారను ఏం చెప్పి ఒప్పించారో తెలియదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.