Manchu Controversy: గాయపడిన జర్నలిస్ట్‌కు మోహన్‌బాబు క్షమాపణలు.. ఎక్స్ వేదికగా లేఖ విడుదల
మోహన్‌బాబు తన నివాసంలో జరిగిన ఉద్రిక్తతలపై మరోసారి స్పందించారు. ఆ ఘటనలో గాయపడిన జర్నలిస్ట్‌కి క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. దీనితో పాటు సంబంధిత మీడియా సంస్థకు బహిరంగ లేఖను కూడా పంపారు.
50మంది వ్యక్తులు నా ఇంట్లోకి రావడం వలన..
ఆ లేఖలో మోహన్‌బాబు ఇలా పేర్కొన్నారు:"ఇటీవలి దురదృష్టకర సంఘటన గురించి అధికారికంగా ప్రస్తావించాల్సి రావడం విచారకరం.ఇది వ్యక్తిగత కుటుంబ వివాదంగా మొదలై ఘర్షణకు దారితీసింది.ఈ ఘటనలో జర్నలిస్ట్ సోదరుడికి కలిగిన అనుభవానికి నేను బాధపడుతున్నాను. అనారోగ్య కారణాల వల్ల 48గంటల పాటు ఆసుపత్రిలో ఉండడం వల్ల తక్షణం స్పందించలేకపోయాను.అయితే ఆ జర్నలిస్ట్ సహనాన్ని నేను అభినందిస్తున్నాను.ఆ రోజు నా ఇంటి గేటు విరిగిపోవడం,దాదాపు 50మంది వ్యక్తులు నా ఇంట్లోకి రావడం వలన నేను సహనాన్ని కోల్పోయాను.ఆ గందరగోళంలో అనుకోకుండా మీడియా ప్రతినిధులు వచ్చారు.పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలో ఓ జర్నలిస్ట్‌కు గాయమైంది.ఇది చాలా దురదృష్టకరం. అతనికి,అతని కుటుంబానికి కలిగిన బాధకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను."
తీవ్ర అసహనానికి గురైన మోహన్‌బాబు
ఇక మరోవైపు, జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఉద్రిక్తతలు అందరినీ కలవరపరిచాయి. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్‌బాబు నివాసానికి చేరుకోగా, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. గేట్లు తీయకపోవడంతో మనోజ్ ఆగ్రహానికి గురై గేట్లను తోసుకుని లోపలికి ప్రవేశించారు. ఆయనతో పాటు మీడియా ప్రతినిధులు కూడా మోహన్‌బాబు ఇంట్లోకి చేరుకున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్య మోహన్‌బాబు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అక్కడే ఉన్న కొన్ని మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక జర్నలిస్ట్ గాయపడ్డారు.