Mrunal Thakur: తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకో.. మృణాల్‌కు అల్లు అరవింద్ సూచన
ఈ వార్తాకథనం ఏంటి
అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, బన్నీ వాసు, స్వప్న దత్‌తో పాటు అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా హీరోయిన్ మృణాల్‌ను ఉద్దేశించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సభలో మాట్లాడిన అల్లు అరవింద్ చిత్రబృందాన్ని అభినందించారు.
వివరాలు
భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తపరిచింది
హీరో అడివి శేష్‌పై ప్రశంసలు కురిపిస్తూ, శేష్ నిజంగానే ఒక డెకాయిట్ లాంటి వాడు. మంచి కథలను వెతికి పట్టుకుని, వాటితో ప్రేక్షకుల మనసులను దోచేస్తున్నాడని సరదాగా వ్యాఖ్యానించారు. దర్శకుడు షానిల్ డియో క్రైమ్ కథలో ప్రేమను మేళవించి అద్భుతంగా తెరకెక్కించాడని, తాను చూసిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుందని అన్నారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ కృషిని, ఎడిటర్ పవన్ కల్యాణ్ పనితీరును కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటన గురించి మాట్లాడుతూ.. 'సీతారామం'లో సీతగా ఆకట్టుకున్న మృణాల్, 'డెకాయిట్'లో సరస్వతి పాత్రలో మరింత పరిణతి చెందిన నటన చూపించింది. భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తపరిచింది" అని కొనియాడారు.
వివరాలు
లావణ్య త్రిపాఠికి కూడా ఇలానే చెప్పా
అనంతరం ఆమె వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలని ఆశీర్వదించారు. గతంలో లావణ్య త్రిపాఠికి కూడా ఇలాగే చెప్పానని, ఆ తరువాత ఆమె వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకుని తమ ఇంటి కోడలైందని గుర్తు చేశారు. అల్లుఅరవింద్ వ్యాఖ్యలకు మృణాల్ సిగ్గుతో నవ్వడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరవింద్ గారి ఆశీర్వాదం ఫలించి లావణ్య మెగా కోడలైంది.. ఇప్పుడు మృణాల్ కూడా తెలుగింటి కోడలు అవుతుందా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.