LOADING...
Director Sandeep Raj: బహుశా నేనే బ్యాడ్ లక్ కావచ్చు.. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ భావోద్వేగం
బహుశా నేనే బ్యాడ్ లక్ కావచ్చు.. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ భావోద్వేగం

Director Sandeep Raj: బహుశా నేనే బ్యాడ్ లక్ కావచ్చు.. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ భావోద్వేగం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్ అనే పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తొలి చిత్రంగానే జాతీయ అవార్డు అందుకుని ఇండస్ట్రీలో విస్తృతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీరంగంలోకి వచ్చినప్పుడు సొంత స్టైల్‌తో పేరు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన, మొదట చిన్న చిన్న షార్ట్‌ఫిల్మ్స్‌తో ప్రయాణం ప్రారంభించారు. తదుపరి 'కలర్ ఫోటో' చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయం సాధించి, భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. సుహాస్-చాందిని జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Details

మోగ్లీ విడుదల విషయంలో గందరగోళం

'కలర్ ఫోటో' తర్వాత సందీప్ రాజ్ రచయితగా గుడ్ లక్ సఖి, ముఖచిత్రం చిత్రాలకు పని చేశారు. అలాగే సీతారామంతో పాటు మరికొన్ని సినిమాల్లో నటుడిగా కూడా కనిపించి తన బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న రెండో చిత్రం 'మోగ్లీ'. యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్టులో సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయికగా కనిపించనుంది. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ డేట్ విషయంలో ఇప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం. అదే రోజు 'అఖండ 2' రిలీజ్ అవుతుందన్న వార్తల కారణంగా 'మోగ్లీ' విడుదలను మేకర్స్ వాయిదా వేయాలని భావిస్తున్నారట.

Details

ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రాజ్ చేసిన తాజా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఇలా రాశారు. కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలకు నాకన్నా మరో దర్శకుడు ఉన్నా బాగుండేదేమో అనిపిస్తోంది. ఇందులో కామన్ పాయింట్ నేనే. బహుశా నేనే బ్యాడ్ లక్ కావచ్చు. 'Directed by Sandeep Raj' అనే పేరు పెద్ద తెరపై కనిపించాలన్న నా కల రోజు రోజుకీ దూరమవుతోంది. అయినప్పటికీ మోగ్లీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మా టీమ్ అభిరుచి, చెమట, రక్తంతో ఈ సినిమాను రూపొందించింది. కనీసం వారి కోసమైనా ఈ సినిమాకు మంచి జరగాలని భావోద్వేగంతో పేర్కొన్నారు.

Advertisement