రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం
నటనకు నిర్వచనమైన మన మెగాస్టార్ చిరంజీవి, నటుడిని నిర్వచించే పాత్రలు ఎన్నో చేసారు. కానీ మొదటిసారిగా నటుడిని నిర్వచిస్తూ షాయరీని వినిపించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగమార్తాండ సినిమాలో నుండి షాయరీని విడుదల చేసారు. చిరంజీవి గొంతుకలోంచి వచ్చిన ఈ షాయరీ, ఆద్యంతం హృద్యంగా ఉంది. నేనొక నటుడిని అంటూ మొదలుపెట్టి చమ్కీల బట్టలేసుకుని, చెక్క కత్తి పట్టుకుని కాగితం పూల వర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని అంటూ అద్భుతమైన పదాలతో అందంగా సాగింది. పదాలను ఏర్చి కూర్చి ఒక అందమైన అల్లిక తయారు చేసినట్టుంది ఈ షాయరీ. వేషం కడితే అన్ని మతాల దేవుణ్ణి, వేషం తీస్తే ఏమీలేని జీవుణ్ణి అని చెప్పడం హైలైట్ గా నిలిచింది.
నేనొక నటుడిని, నాది కాని పాత్రల కోసం వెతికే విటుడిని
పాత్రల కోసం వెతికే విటుడిని అని వాడటం ఈ షాయరీలో మరో హైలైట్. ఇంకా ఇలాంటి హైలైట్స్ ఇందులో చాలానే ఉన్నాయి. హరివిల్లుకు మరో రెండు రంగులు అద్ది నవరసాలు మీకిస్తాను. నేను మాత్రం నలుపు తెలుపుల గందర గోళంలో బ్రతుకుతుంటాను అనే మాటలు ఈ షాయరీని శిఖరాగ్రాన నిలిపాయి. అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుడిని, కానీ తొమ్మిది తలలున్న నట రావణుడిని అని చెప్పడం అద్భుతమనే చెప్పాలి. ఈ షాయరీని మాటల రచయిత లక్ష్మీ భూపాల రచించారు. ఇళయ రాజా ఈ షాయరీకి సంగీతం అందించారు. రాజశ్యామల ఎంటర్ టైన్ మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.