బలగం సినిమాపై మెగాస్టార్ ప్రశంసలు,ఈ జన్మకిది చాలన్న దర్శకుడు
చాలా నిశ్శబ్దంగా వచ్చి థియేటర్ల దగ్గర సంచలనాన్ని సృష్టిస్తున్న చిత్రం బలగం. కమెడియన్ గా చిన్న చిన్న సినిమాల్లో, జబర్దస్త్ స్కిట్లలో కనిపించిన వేణు, బలగం చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం చిత్రం, అందరి ప్రశంసలు దక్కించుకుంటూ విజయం వైపు దూసుకు వెళ్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని దర్శకులు, రాజకీయ రంగ ప్రముఖులు బలగం సినిమాపై పొగడ్తలు కురిపిస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి, బలగం సినిమా బృందాన్ని మెచ్చుకున్నారు. బోళాశంకర్ చిత్ర షూటింగ్లో బలగం సినిమా యూనిట్ ని కలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, వాళ్లకు సన్మానం చేశారు. డైరెక్టర్ వేణు గురించి మాట్లాడుతూ, వేణు ఇలాంటి షాక్ ఇస్తాడని అస్సలు అనుకోలేదని అన్నారు చిరంజీవి.
కలిసి పనిచేయాలనుందటున్న హీరో
అప్పట్లో జబర్దస్త్ లో వేణు వేసిన స్కిట్ ఒకటి తనకు చాలా బాగా నచ్చిందని చెప్పిన మెగాస్టార్, పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నప్పటికీ దర్శకుడుగా 100% న్యాయం చేసావని వేణును అభినందించారు. తనను మెగాస్టార్ అభినందించడంతో, దర్శకుడు వేణు ఆనందంలో ఉన్నారు. తన 20ఏళ్ళ సినీప్రయాణంలో ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ట్విట్టర్ లో పంచుకున్నాడు వేణు. ఇక బలగం హీరో ప్రియదర్శి, చిరంజీవి తమను కలుసుకున్న వీడియోను పోస్ట్ చేసి, చిన్నప్పటి నుండి మీ సినిమాలు చూసి పెరిగామని, ఇప్పుడు మీ పక్కన నిల్చుండే అవకాశం రావడం సంతోషంగా ఉందనీ, ఏదో ఒకరోజు మీతో కలిసి నటించే రోజు వస్తుందని అన్నాడు. మొత్తానికి బలగం చిత్రానికి రోజు రోజుకూ బలగం పెరుగుతూనే ఉంది.