Jailer 2: 'జైలర్ 2'లో షారుక్ ఖాన్.. హింట్ ఇచ్చిన నటుడు
ఈ వార్తాకథనం ఏంటి
రజనీకాంత్ ప్రధాన పాత్రలో, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జైలర్' ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుని బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు సీక్వెల్ 'జైలర్ 2'పై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. తాజాగా సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఆ అంచనాలను మరింత పెంచాయి. మొదటి భాగంలో వివిధ భాషలకు చెందిన అగ్ర నటులు అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. అదే సంప్రదాయాన్ని రెండో భాగంలోనూ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లో మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో నటించనున్నారు.
వివరాలు
మొదటి భాగం ముగిసిన చోటు నుంచే సీక్వెల్ కథ
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, 'జైలర్ 2'ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందులో మోహన్ లాల్,షారుక్ ఖాన్,రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్‌లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారని వెల్లడించారు. దీంతో షారుక్ ఇందులో ఉన్నట్లు ఎన్నోరోజుల నుంచి వస్తోన్న వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇదే విషయంపై శివరాజ్‌కుమార్ కూడా ఇటీవల స్పందించారు. ''మొదటి భాగం ముగిసిన చోటు నుంచే సీక్వెల్ కథ ప్రారంభమవుతుంది.రెండో భాగంలో నా పాత్ర నిడివి మొదటి భాగంతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. జనవరిలో మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేస్తాను''అని ఆయన తెలిపారు. చిత్రబృందం వచ్చే ఏడాది జూన్ 12న 'జైలర్ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది.