70ఏళ్ళ వయసులో మిథునం సినిమా రచయిత శ్రీరమణ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత రచయిత శ్రీరమణ ఈరోజు తెల్లవారు జామున ఉదయం 5గంటల ప్రాంతంలో కన్నుమూసారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీరమణ, 70ఏళ్ళ వయసులో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు.
1952 సెప్టెంబర్ 21వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో జన్మించారు శ్రీరమణ. మొదట జర్నలిస్టుగా కెరీర్ మొదలెట్టి ఆ తర్వాత ఆంధ్రజ్యోతి నవ్య, సాక్షి పత్రికలకు ఎడిటర్ గా పనిచేసారు.
సెటైరికల్ కాలమ్స్, హాస్యంతో కూడుకున్న కథలను రచించడంలో శ్రీరమణ దిట్ట. దిగ్గజ దర్శకులైన బాపు - రమణల వద్ద శ్రీరమణ కొన్నేళ్ళపాటు పనిచేసారు.
తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన మిథునం సినిమా కథ శ్రీరమణదే.
Details
మిథునం సినిమా విశేషాలు
కేవలం 25పేజీల మిథునం కథను నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి, పూర్తి సినిమాగా మార్చేసారు. ఈ సినిమాలో రెండే పాత్రలు ఉంటాయి.
60ఏళ్ళు పైబడిన వృద్ధులు తమ జీవితాన్ని ఎలా గడిపారన్నదే ఈ సినిమా కథ. మిథునం సినిమా 2012లో విడుదలైంది. రిలీజైన నాటికి 25ఏళ్ల క్రితమే మిథునం కథను శ్రీరమణ రాసారు.
మిథునం సినిమాకు నాలుగు నంది అవార్డులు దక్కాయి. శ్రీరమణ మృతిపట్ల టాలీవుడ్ సెలెబ్రిటీలు, రచయితలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.