
MM Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు ఇంట విషాదం.. తండ్రి కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన తండ్రి శివశక్తి దత్తా (92) సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు సోదరుడైన శివశక్తి దత్తా, సినీరంగానికి విలువైన పాటలు అందించిన గీత రచయితగాను ప్రసిద్ధి చెందారు. శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన 1932 అక్టోబర్ 8న రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరు గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే కళలపై ప్రగాఢమైన ఆసక్తి కలిగిన ఆయన, ఇంటి నుంచి బయటకు వెళ్లి ముంబయిలో ఉన్న ఒక ఆర్ట్స్ కాలేజీలో చేరారు.
వివరాలు
'జానకీ రాముడు' చిత్రం ద్వారా శివశక్తి దత్తాకు మంచి గుర్తింపు
అక్కడ రెండేళ్ల పాటు చదువుకున్న తర్వాత తిరిగి కొవ్వూరుకు వచ్చి "కమలేశ్" అనే కలం పేరుతో చిత్రకారుడిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. అనంతరం సంగీత పట్ల ఆకర్షణతో గిటార్, సితార్, హార్మోనియం వంటివి నేర్చుకున్నారు. తర్వాత మద్రాసుకు వెళ్లి తన సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి సినీరంగంలో అడుగుపెట్టారు. 1988లో విడుదలైన 'జానకీ రాముడు' చిత్రం ద్వారా శివశక్తి దత్తాకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆయన స్క్రీన్‌రైటర్‌గా పనిచేశారు.
వివరాలు
శివశక్తి దత్తా తమ్ముడు ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్
ఆపై 'బాహుబలి - ది బిగినింగ్'లో "మమతల తల్లి", "ధీవర", 'బాహుబలి - ది కన్‌క్లూజన్'లో "సాహోరే బాహుబలి", 'ఎన్టీఆర్: కథానాయకుడు'లో "కథానాయక", 'ఆర్‌ఆర్‌ఆర్'లో "రామం రాఘవం", 'హనుమాన్' చిత్రంలో "అంజనాద్రి థీమ్ సాంగ్", 'సై' సినిమాలో "నల్లా నల్లని కళ్ల పిల్ల", 'ఛత్రపతి'లో "మన్నేల తింటివిరా", 'రాజన్న' చిత్రంలో "అమ్మా అవని" పాటలకు ఆయన సాహిత్యం అందించారు. శివశక్తి దత్తాకు ముగ్గురు పిల్లలు.. కీరవాణి,కల్యాణి మాలిక్,శివశ్రీ కంచి. ఆయనకు ఒక అన్న, ఒక అక్కతో పాటు నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. ఆయన తమ్ముడే ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. అలాగే, శివశక్తి దత్తా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, గాయని మరియు సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖలకు పెద్దనాన్న అవుతారు.