Page Loader
Barroz : మోహన్ లాల్ బరోజ్ తెలుగు ట్రైలర్ రీలీజ్..

Barroz : మోహన్ లాల్ బరోజ్ తెలుగు ట్రైలర్ రీలీజ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2024
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇటీవల సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. ఆయనకు భారీ అంచనాలతో వచ్చిన "మలైకుట్టి వాలీబాన్" చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, ఈసారి మోహన్‌లాల్ కొత్త ప్రయత్నం చేశారు. ఆయన స్వయంగా దర్శకత్వం వహించిన "బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం పూర్తిగా 3D లో తెరకెక్కింది. ఇందులో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడే "బరోజ్" అనే జెనీ పాత్రలో కనిపించనున్నారు. మలయాళం,తెలుగు,తమిళం,కన్నడ,హిందీ భాషలతో ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా, తాజాగా తెలుగు ట్రైలర్‌ను మోహన్‌లాల్ విడుదల చేశారు. బరోజ్ ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్,అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

వివరాలు 

డిసెంబర్ 25న విడుదల

ఈ చిత్రం జిజో పున్నూస్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. బరోజ్‌కు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించగా, లిడియన్ నాధస్వరం సంగీతం సమకూర్చారు. USA నుండి మార్క్ కిలియన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. గతేడాది ఈ సినిమా విడుదల కావాల్సినప్పటికీ, అనేక వాయిదాల తరువాత, ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూరు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మాయ, సీజర్ లోరెంటే రాటన్, కల్లిర్రోయ్ టిజియాఫెటా, తుహిన్ మీనన్, గురు సోమసుందరం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీస్ సంస్థ విడుదల చేయనుంది.