Drishyam 3: మోహన్‌లాల్ ఫ్యాన్స్‌కు నిరాశ.. 'దృశ్యం 3' విడుదల వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ బ్లాక్‌బస్టర్ దృశ్యం సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినీ పరిశ్రమలో భారీ సంచలనం సృష్టించింది. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు భాగాలు ప్రేక్షకులను విశేషంగా అలరించి భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌కు కొనసాగింపుగా దృశ్యం 3 తెరకెక్కుతోంది. మలయాళ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
వివరాలు
విడుదల వాయిదా
అయితే అభిమానులకు నిరాశ కలిగించే వార్తను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
యుద్ధ ప్రభావం
ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. మలయాళ చిత్రాలకు గల్ఫ్ దేశాలు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటాయి. అక్కడి అనిశ్చిత పరిస్థితుల వల్ల థియేటర్ల వద్ద వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న సినిమా కావడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో 'దృశ్యం 3' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు కొంత నిరాశకు గురవుతున్నారు. కొత్త విడుదల తేదీపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.