Page Loader
Thudarum: 'తుడ‌రుమ్' తెలుగు ట్రైల‌ర్‌ రిలీజ్

Thudarum: 'తుడ‌రుమ్' తెలుగు ట్రైల‌ర్‌ రిలీజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక వైపు 'ఎల్2 ఎంపురాన్‌' సినిమాతో ఘన విజయం సాధించాడు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించగా, ఇది గతంలో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా 'లూసిఫర్‌'కు కొనసాగింపుగా రూపొందింది. మంజు వారియర్‌,టోవినో థామస్‌ వంటి ప్రముఖ నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి 27న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన పొందుతూ సుమారు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా విజయం తరువాత మోహన్‌లాల్ తన తదుపరి చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా మలయాళ చిత్రం పేరు 'తుడ‌రుమ్'.

వివరాలు 

 38 ఏళ్ల విరామం తర్వాత మోహన్‌లాల్- శోభన కాంబినేషన్‌

ఈ సినిమాకు 'ఆపరేషన్ జీవా' చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం. రెంజిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటి శోభన కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు మోహన్‌లాల్- శోభన కాంబినేషన్‌లో 55 సినిమాలు వచ్చాయి. 'తుడ‌రుమ్' వీరిద్దరి కలయికలో 56వ చిత్రం కానుంది. శోభన చివరిసారి మోహన్‌లాల్‌తో కలిసి 1987లో నటించింది. అంటే సుమారు 38 ఏళ్ల విరామం తర్వాత ఈ జోడీ మళ్లీస్క్రీన్ పై కనిపించనుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది.

వివరాలు 

క్రైమ్ కామెడీ నేపథ్యం

కథ పరంగా చూస్తే, మోహన్‌లాల్ ఇందులో ఓ టాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. అతని కారు ఊహించని సమస్యలో ఇరుక్కుపోతుంది. ఆ సమస్య ఏమిటి? మోహన్‌లాల్‌ ఆ కారుని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఎందుకు ఉండ‌లేడు ? అన్నది థ్రిల్లింగ్‌గా తెరకెక్కింది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది.