Mowgli Review: మౌగ్లీ సినిమా రివ్యూ.. యాంకర్ సుమ కొడుకు ఆశలు నెరవేరాయా?
ఈ వార్తాకథనం ఏంటి
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల 'బబుల్ గమ్' సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమయ్యాడు. అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రోషన్, ఈసారి 'కలర్ ఫోటో'తో నేషనల్ అవార్డు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మౌగ్లీ' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ఇప్పుడు చూద్దాం.
Details
కథ
పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలో మౌగ్లీ అలియాస్ మురళీ కృష్ణ (రోషన్ కనకాల) జీవనం సాగిస్తూ ఉంటాడు. స్థానికంగా జరుగుతున్న సినిమా షూటింగ్‌లకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసే పనిని తన స్నేహితుడు ప్రభాస్ బంటి (వైవా హర్ష)తో కలిసి చేస్తూ, మరోవైపు ఎస్సై కావాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సైడ్ డాన్సర్‌గా వచ్చిన జాస్మిన్ (సాక్షి మడోల్కార్)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు.
Details
మొదటి చూపులోనే హీరోయిన్ తో ప్రేమ
అయితే అదే సినిమా నిర్మాత కూడా జాస్మిన్‌పై కన్నేసి, ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఆమెను దాదాపుగా ట్రాప్ చేసిన సందర్భంలో మౌగ్లీకి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేమిటి? ఈ కథలో క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) పాత్ర ఏమిటి? చివరికి హీరో, హీరోయిన్ కలిశారా? వారి ప్రేమ గెలిచిందా లేదా? అన్న విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
Details
విశ్లేషణ
'కలర్ ఫోటో' లాంటి విభిన్నమైన సినిమా తీసి దర్శకుడిగా తన సత్తా చాటిన సందీప్ రాజ్ నుంచి మరో సినిమా వస్తుందంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. అయితే ఆ అంచనాలను 'మౌగ్లీ' అందుకోలేకపోయిందనే చెప్పాలి. కొత్త కథ ఆశించి థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. ఎందుకంటే ఇది మనం ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన కథను స్వల్ప మార్పులతో తెరకెక్కించిన సినిమా. సాధారణ నేపథ్యానికి చెందిన హీరో, అతనికంటే బలహీన స్థితిలో ఉన్న హీరోయిన్, ఆమెపై కన్నేసిన వ్యవస్థలోని బలవంతుడు... చివరకు ఆ బలహీనుడు ఆ బలవంతుడిని ఎలా ఎదుర్కొన్నాడు అన్న లైన్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇదే కథను 'కర్మ సిద్ధాంతం' అనే భావనతో ముడిపెట్టి దర్శకుడు తెరకెక్కించాడు.
Details
క్లైమాక్స్ అద్భుతం
కథ పాతదే అయినా కథనం కొత్తగా ఉంటుందా అంటే,అది కూడా అంతగా ఆకట్టుకోదు. ఫస్ట్ హాఫ్ అంతా సాగదీస్తున్న భావన కలుగుతుంది. సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత కథ వేగం పెరుగుతుందనిపించినా, అదేచుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అయితే క్లైమాక్స్ మాత్రం కొంతమందికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు రూపొందించాడు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా మొత్తంలో కొత్తగా అనిపించేది క్లైమాక్స్ ఒక్కటే. కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ముగింపు రాయడం కొంతవరకు వర్కౌట్ అయింది. ప్రేమ, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందిన 'మౌగ్లీ'లో కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నప్పటికీ, రొటీన్ కథనం కారణంగా సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. రచన బాగానే ఉన్నా, కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్, భావోద్వేగాలను పండించిన తీరు మెప్పిస్తుంది.
Details
నటీనటులు
హీరో రోషన్ కనకాల, విలన్ పాత్రలో బండి సరోజ్, కామెడీ టచ్‌తో వైవా హర్ష తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా రోషన్ తన తొలి సినిమా 'బబుల్ గమ్'తో పోలిస్తే నటనలో గణనీయంగా మెరుగయ్యాడు. లుక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. అయినా తన పాత్రకు మాత్రం పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. బండి సరోజ్ నటనలో లోపం ఏమీ లేకపోయినా, ఇలాంటి లౌడ్, నెగెటివ్ పాత్రలే వరుసగా చేస్తుండటంతో రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది. భవిష్యత్తులో విభిన్న పాత్రలు చేయకపోతే అతనికి ఇబ్బందికరంగా మారే అవకాశముంది. హీరోయిన్ సాక్షి మడోల్కార్‌కు డైలాగ్స్ చెప్పే అవకాశాలు తక్కువే అయినా, ఎక్స్‌ప్రెసివ్ పర్‌ఫార్మెన్స్‌తో, కళ్లతోనే భావాలను పలికిస్తూ ఆకట్టుకుంది.
Details
సాంకేతిక అంశాలు
సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చక్కగా ఉంది. నేపథ్య సంగీతం మాత్రం కొత్తదనాన్ని అందించలేకపోయింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. మంచి లొకేషన్లలో సినిమాను అందంగా చిత్రీకరించారు. నిర్మాణ విలువల విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు. సినిమాపై గట్టిగానే ఖర్చు పెట్టినట్లు కనిపిస్తుంది. నిడివి విషయంలో ఇంకాస్త కత్తిరించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల కోసం రూపొందించిన ఫైట్ డిజైన్ కూడా మెప్పిస్తుంది.