ఇప్పటివరకు అలాంటి స్క్రిప్ట్ చదవలేదంటూ నాని 30పై అంచనాలు పెంచేసిన మృణాల్ ఠాకూర్
సీతారామం సినిమాలోని సీత పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది మృణాల్ ఠాకూర్. సీతారామం లోని సీత పాత్రను ఇప్పట్లో ఎవ్వరూ మర్చిపోలేరు. తాజాగా మృణాల్ ఠాకూర్ మీడియా ముందుకు వచ్చింది. బాలీవుడ్ లో ఆమె నటించిన గుమ్రా సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ, నాని 30 సినిమా స్క్రిప్టుపై ప్రశంసలు కురిపించింది. అలాంటి స్క్రిప్టు తను ఇంతవరకు చదవలేదట. అంతమంచి స్క్రిప్ట్ తన దగ్గరకు వచ్చిందని, కొత్త దర్శకుడు శౌర్యువ్ మంచి కథ రాసుకున్నాడనీ, ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తయ్యిందనీ, మరో షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో మొదలవుతుందని ఆమె తెలిపింది. నాని 30 సినిమా స్క్రిప్ట్ పై మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
సీత స్థాయి పాత్ర కోసం ఆరు నెలలు వెయిట్ చేసిన మృణాల్
అదలా ఉంచితే, సీతారామం తర్వాత మరో సినిమా ఒప్పుకోవడానికి ఆమెకు చాలా టైమ్ పట్టిందట. ఏదైనా సినిమా కోసం డైరెక్టర్లను, నిర్మాతలను అడిగితే, సీతారామంలోని సీత పాత్రకు సమానంగా ఉండే పాత్ర వచ్చినపుడు కబురు చేస్తామని చెప్పేవారట. సీత పాత్ర ప్రేక్షకుల్లో నిలిచిపోయింది కాబట్టి తర్వాతి సినిమాలో వచ్చే పాత్ర, సీత పాత్రకు తగ్గకుండా ఉండాలని చాలా కథలు విన్నారట మృణాల్. అందుకే సీతారామం తర్వాత మరో సినిమాను ఒప్పుకోవడానికి 6నెలల సమయం పట్టిందట. మొత్తానికి మృణాల్ ఠాకూర్ కు నాని 30లో మంచి పాత్ర దొరికిందని అర్థం అవుతోంది. మరి ఆ పాత్ర కూడా సీత లాంటి ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది చూడాలి.