Pushpa 2: 'పుష్ప 2' స్క్రీనింగ్‌కు అంతరాయం- హాలులో స్ప్రే కలకలం- ఇబ్బంది పడ్డ ప్రేక్షకులు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం 'పుష్ప 2' ముంబయిలోని బాంద్రా గెలాక్సీ థియేటర్‌లో ప్రదర్శన జరుగుతుండగా ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి సెకండ్ షో సమయంలో గుర్తు తెలియని వ్యక్తి థియేటర్ హాలులో ఘాటైన స్ప్రే చల్లడంతో ప్రేక్షకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో సినిమా ప్రదర్శనకు 15-20 నిమిషాల బ్రేక్ పడింది. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులు బయటకు వెళ్లిన సమయంలో ఈ స్ప్రే చల్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రేక్షకులు హాలులోకి తిరిగి వచ్చినప్పుడు దగ్గు, వాంతులు, శ్వాస సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఇది గమనించిన థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపి, పోలీసులకు సమాచారం అందించింది.
వాసన వల్ల దగ్గు, వాంతులు
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. 20 నిమిషాల తర్వాత సినిమా ప్రదర్శన తిరిగి ప్రారంభమైంది. స్ప్రే చల్లిన వ్యక్తి ఎవరో ఇప్పటివరకు గుర్తించలేదు. ఒక ప్రేక్షకుడు ఈ ఘటనపై స్పందిస్తూ, "ఇంటర్వెల్ టైమ్‌లో మేము బయటకు వెళ్లాం. తిరిగి హాలులోకి వచ్చే సరికి ఘాటైన స్ప్రే వాసన వచ్చింది. ఆ వాసన వల్ల చాలా మంది దగ్గు, వాంతులు చేసుకున్నారు. దీంతో స్క్రీనింగ్ ఆగిపోయింది. పోలీసులు వచ్చి చెక్ చేసిన తర్వాత షో మళ్లీ ప్రారంభమైంది," అని తెలిపారు.
రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం
అయితే, అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మంధన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సంపాదించుకుంది. యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకోగా, ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీమేకర్స్ బ్యానర్‌పై రవి, నవీన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.