LOADING...
A R Rahman: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఏఆర్‌ రెహమాన్‌ భావోద్వేగ వ్యాఖ్యలు
నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఏఆర్‌ రెహమాన్‌ భావోద్వేగ వ్యాఖ్యలు

A R Rahman: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఏఆర్‌ రెహమాన్‌ భావోద్వేగ వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌పై ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారన్న అభిప్రాయంతో ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. తన మాటలతో ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సంగీతం అనేది దేశ సంస్కృతిని అనుసంధానించడానికి, వేడుకగా జరుపుకోవడానికి, గౌరవించడానికి ఉపయోగపడే శక్తివంతమైన మార్గమని రెహమాన్ చెప్పారు. ''భారత్‌ నాకు స్ఫూర్తి. ఈ దేశమే నా గురువు, నా ఇల్లు కూడా. భారతీయుడిగా పుట్టడం నేను అదృష్టంగా భావిస్తాను. నా భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, విభిన్న స్వరాలతో పనిచేయడానికి ఈ దేశమే అవకాశం ఇచ్చింది.

Details

నా నిజాయితీని అందరూ అర్థం చేసుకోవాలి

కొన్నిసార్లు ఒకరి ఉద్దేశాలను మరొకరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు వస్తాయని ఇప్పుడు గ్రహించాను. సంగీతం ద్వారా ఉత్తేజపరచడం, గౌరవించడం, సేవ చేయడమే నా లక్ష్యం. ఎప్పుడూ ఎవరికీ బాధ కలిగించాలని నేను కోరుకోలేదు. నా నిజాయితీని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. వేవ్స్‌ సమిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో 'ఝాలా' సంగీతాన్ని ప్రదర్శించడం నుంచి, యువ నాగా సంగీతకారులతో కలిసి పనిచేయడం వరకు, దేశంలోనే తొలి మల్టీకల్చరల్‌ వర్చువల్‌ బ్యాండ్‌ను రూపొందించడం నుంచి, హాన్స్‌ జిమ్మర్‌తో కలిసి 'రామాయణం' సినిమాకు సంగీతం అందించడం వరకు... తన ప్రతి ప్రయాణం తన లక్ష్యాలను మరింత బలపరిచిందని రెహమాన్ తెలిపారు.

Details

అసలేం జరిగింది అంటే…

ఇటీవల రెహమాన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బాలీవుడ్‌లో తమిళ్‌ లేదా మహారాష్ట్రేతరులపై పక్షపాతం ఉందా?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన ఆయన, వ్యక్తిగతంగా తాను ఎప్పుడూ ఎలాంటి వివక్షను ఎదుర్కోలేదని చెప్పారు. అయితే గత ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఒక రకమైన 'పవర్‌ షిఫ్ట్‌' కనిపిస్తోంది. సృజనాత్మకత లేని వ్యక్తులే కీలక స్థానాల్లో ఉంటున్నారు. దీనికి మతపరమైన అంశం కూడా ఓ కారణం కావొచ్చు. అది నాకు నేరుగా ఎదురుకాలేదు గానీ, అలాంటి గుసగుసలు మాత్రం వినిపించాయి. నేను పని కోసం వెతకను. నిజాయితీగా పనిచేస్తే, పనే మన దగ్గరకు వస్తుందని నమ్ముతానని వ్యాఖ్యానించారు. ఈవ్యాఖ్యలే వివాదానికి దారి తీయడంతో, తాజాగా ఆయన స్పష్టీకరణ ఇస్తూ తన ఉద్దేశాలను వివరించారు.

Advertisement