NBK Lineup : బాలకృష్ణ లైనప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. దర్శకుడు ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ సినిమా జాబితాలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న 'NBK111' చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అలాగే దర్శకుడు కొరటాల శివతో చేయనున్న 'NBK112' సినిమా షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో యువ దర్శకుడు బాలకృష్ణతో సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళ చిత్రసీమలో 'మార్క్ ఆంటోని', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అధిక్ రవిచంద్రన్, బాలకృష్ణ కోసం ఓ భారీ మాస్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
వివరాలు
ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చలు..
ఇటీవల ఆయన బాలకృష్ణను కలిసి కథా రూపరేఖలను వివరించగా, ఆ కథ నచ్చడంతో సానుకూల స్పందన లభించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి అధిక్ రవిచంద్రన్ తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో తెరకెక్కించాలని భావించారు. 'AK64' పేరుతో రూపొందాల్సిన ఈ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమవుతుందని భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అది ముందుకు సాగలేదు.
వివరాలు
భారీ స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్..
దీంతో ఆ కథను బాలకృష్ణ శైలికి అనుగుణంగా మార్పులు చేసి వినిపించగా, ఆయనకు కథ నచ్చినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే, ప్రేక్షకులకు భారీ స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అందే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.