Nandus World Scam: యూకే ఉద్యోగాల పేరుతో మోసం.. 'నందూస్ వరల్డ్' నిర్వాహకులపై ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబ్‌లో 'నందూస్ వరల్డ్' పేరుతో ప్రసిద్ధి చెందిన రమా నందన, ఆమె భర్త మధుకర్‌పై మోసం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యూకేలో ఉద్యోగాలు కల్పిస్తామని, వీసా పునరుద్ధరణ (రెన్యువల్) చేయిస్తామని చెప్పి పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని తర్వాత స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది నవంబర్‌లోనే కేసు నమోదైనప్పటికీ, విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాలు
'డెస్టినీ కన్సల్టెన్సీ' పేరుతో కార్యాలయాలు..
గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, రమా నందన దంపతులు ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు. రమా నందన 'నందూస్ వరల్డ్' పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వీరికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర నగరాల్లో 'డెస్టినీ కన్సల్టెన్సీ' పేరుతో కార్యాలయాలు ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ అనే వ్యక్తికి లండన్‌లో చదువుకునే సమయంలో మధుకర్‌తో పరిచయం ఏర్పడింది. చదువు పూర్తయ్యాక కొంతకాలం అక్కడ ఉద్యోగం చేసిన శివ, తరువాత భారత్‌కు తిరిగి వచ్చారు. తన వీసా పునరుద్ధరణతో పాటు భార్యకు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS), ఉద్యోగ అవకాశాల కోసం మధుకర్‌ను సంప్రదించారు.
వివరాలు
నకిలీ స్పాన్సర్‌షిప్ పత్రం ఇచ్చినట్లు ఆరోపణ..
ఈ ప్రక్రియ కోసం గుంటూరులోని డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని, అక్కడ తన తండ్రి మోహన్‌రావుకు మొత్తం రూ.15 లక్షలు చెల్లించాలని మధుకర్ సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023లో గుంటూరులో మోహన్‌రావును కలిసిన శివ క్రాంతి, వారి సూచన మేరకు రెండు బ్యాంకు ఖాతాలకు కలిపి రూ.15 లక్షలు బదిలీ చేశారు. డబ్బులు చెల్లించిన రెండు నెలల తరువాత మధుకర్, 'అగార్డ్ సొల్యూషన్స్' పేరుతో ఒక సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ పంపించారు. అయితే ఆ పత్రం నిజమా కాదా అన్న అనుమానంతో శివ సంబంధిత సంస్థను సంప్రదించగా, ఆ కంపెనీ యజమాని ఫైజల్ స్పందించారు.
వివరాలు
పోలీసులు కేసు నమోదు..
తాను కొంతకాలం మరో దేశంలో ఉన్న సమయంలో తన పేరును ఉపయోగించి మధుకర్ తప్పుడు పత్రం జారీ చేసి ఉండవచ్చని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో ఉద్యోగం అవసరం లేదని, కనీసం చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని శివ పలుమార్లు కోరారు. అయితే నందన దంపతులు మొత్తం మొత్తంలో కేవలం రూ.2 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించినట్లు ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో శివ క్రాంతి గత ఏడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మధుకర్‌ను ఏ1గా, రమా నందనను ఏ2గా, మోహన్‌రావును ఏ3గా చేర్చారు.
వివరాలు
ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫిర్యాదులున్నాయా?
పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ వారి నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో కేసును రద్దు చేయాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ ప్రస్తుతం విచారణలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందిన మరికొందరు కూడా ఇదే తరహా మోసానికి గురైనట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. బాధితుల నుంచి ఒక్కొక్కరి వద్ద సుమారు రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం వెలువడుతోంది.
వివరాలు
ఆరోపణలపై రమా నందన స్పందన..
ఈ ఆరోపణల నేపథ్యంలో రమా నందన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు. తమ కుటుంబంపై వ్యక్తిగత వైరం కారణంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కొంతమందిపై యూకేలో ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే, తమ పేర్లతో ఎలాంటి కంపెనీలు లేవని, తమ పేర్లను ఉపయోగించి కొందరు ఇతరులు డబ్బులు సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇటువంటి వ్యవహారాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.