Balakrishna : నాన్న శస్త్రచికిత్స విజయవంతమైంది.. బాలయ్య ఆరోగ్యంపై నారా బ్రహ్మాణి కీలక అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడిన విషయం తెలిసిందే. సంఘటన జరిగిన వెంటనే చిత్రబృందం అప్రమత్తమై ఆయనకు ప్రాథమిక చికిత్స అందించింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మోకాలికి శస్త్రచికిత్స అవసరమని సూచించగా, విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. కోలుకునేందుకు దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు బాలయ్య త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.
వివరాలు
నారా బ్రహ్మాణి అభిమానులకు శుభవార్త..
ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ ఆరోగ్యంపై ఆయన పెద్ద కుమార్తె నారా బ్రహ్మాణి అభిమానులకు శుభవార్త అందించారు.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితిపై తాజా వివరాలు వెల్లడించారు.
"నాన్నకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
మునుపటిలాగే ఉత్సాహంగా కోలుకుంటున్నారు. త్వరలోనే తిరిగి తన పనుల్లో నిమగ్నం అవుతారు.
ఈ సమయంలో ఆయన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, ప్రేమాభిమానాలు చూపిన అందరికీ మా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ అందరికీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం" అని నారా బ్రహ్మాణి తన పోస్టులో పేర్కొన్నారు.