LOADING...
IBomma Ravi: ఐబొమ్మ రవికి నెటిజన్ల మద్దతు వెల్లువ… నిర్మాత బన్నీ వాసు ఆగ్రహం!
ఐబొమ్మ రవికి నెటిజన్ల మద్దతు వెల్లువ… నిర్మాత బన్నీ వాసు ఆగ్రహం!

IBomma Ravi: ఐబొమ్మ రవికి నెటిజన్ల మద్దతు వెల్లువ… నిర్మాత బన్నీ వాసు ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంచలనానికి కారణమైన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. రెండు రోజులుగా రవిని ప్రశ్నిస్తోన్న పోలీసులు, రెండో రోజు ఆరు గంటలకు పైగా విచారించి పలు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం అనూహ్యంగా రవికి సాధారణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. థియేటర్లలో టికెట్ రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో కొత్త సినిమాలను ఉచితంగా అందించినందుకు రవిని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Details

పైరసీకి మద్దతు ఇవ్వడం చట్టవిరుద్ధం

ఖరీదైన వినోదం కాలంలో, ఐబొమ్మ తమకు ఉచిత వేదికలా ఉపయోగపడిందని అనేక మంది సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో వేలాది పోస్టులు, వీడియోలు పెడుతూ రవికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొందరైతే అతనిని 'హీరో'గా కూడా అభివర్ణిస్తున్నారు. అయితే, ఈ 'మద్దతుపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తీవ్రంగా స్పందించారు. ఒక ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఐబొమ్మ రవిని హీరోగా చూడటం తాను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. పైరసీకి మద్దతు ఇవ్వడం చట్టవిరుద్ధమని, సమాజానికి హానికరమని హెచ్చరించారు.

Details

హీరోలా చూపించడం తగదు

రవి చేసిన చర్యల వల్ల సినీ పరిశ్రమకు కోట్ల రూపాయుల నష్టం వాటిల్లిందని, దీనిని విస్మరించకూడదని అన్నారు. సోషల్ మీడియాలో రవిని దేవుడిలా, హీరోలా చూపించడం తగదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి— పోలీసు విచారణ ఒక వైపు కొనసాగుతుండగా, రవికి సోషల్ మీడియాలో లభిస్తున్న మద్దతు మరో చర్చనీయాంశంగా మారింది.