ప్రభుదేవా కొత్త సినిమాపై విపరీతంగా ట్రోలింగ్: గూగుల్ అనువాదమే కారణం
స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ప్రస్తుతం అటు యాక్టింగ్, ఇటు దర్శకత్వంలో బిజీగా ఉన్నారు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో పాన్ ఇండియా రేంజ్ లో వూల్ఫ్(Wolf) సినిమా వస్తోంది. ఈ సినిమా టైటిల్ తెలుగు అనువాదమే ఇప్పుడు ట్రోలింగ్ కి కారణమైంది. వూల్ఫ్ తెలుగు పోస్టర్ లో వుల్ఫ అని పడింది. దాంతో నెటిజన్లు అందరూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వుల్ఫ అంటే దేనికీ పనికిరాని వాడు అనే అర్థంలో తెలుగు ప్రజలు వాడుతుంటారు. అచ్చు తప్పుల కారణంగా వుల్ఫ అని టైటిల్ పోస్టర్ మీద కనిపించడంతో ట్రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న సినిమా, టైటిల్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవరిస్తారా అని మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు.
పాన్ ఇండియాపై పట్టింపు లేదు
తెలుగు టైటిల్ పోస్టర్ ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయనీ, టైటిల్ పోస్టర్ నే సరిగ్గా పట్టించుకోలేని వారు డబ్బింగ్ ని ఏమాత్రం పట్టించుకుంటారని నెటిజన్లు అడుగుతున్నారు. మరి వూల్ఫ్ తెలుగు టైటిల్ పోస్టర్ సంగతి మేకర్స్ దాకా చేరుకుంటుందా? లేదంటే థియేటర్లలోకి కూడా వుల్ఫ అనే పేరుతోనే రిలీజ్ అవుతుందా అనేది చూడాలి. వూల్ఫ్ సినిమాలో రాయ్ లక్ష్మీ, అనసూయ భరధ్వాజ్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు విను వెంకటేష్ దర్శకత్వం వహించారు.