కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో స్పై సినిమాకు సంబంధం ఉందా అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ స్పై. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యాన్ని ఛేధించే సినిమాగా స్పై ఉండబోతుందని టీజర్ ద్వారా అర్థమయ్యింది. అయితే స్పై సినిమాకు కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ సినిమాకు సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. డెవిల్ సినిమాలో బ్రిటీష్ ఏజెంటుగా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడు. డెవిల్ సినిమాకు స్పై సినిమాకు సంబంధం ఉందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పిన హీరో నిఖిల్, డెవిల్ సినిమాకు, స్పై సినిమాకు కొంచెం కూడా సంబంధం లేదని, అది వేరె కథ అని, ఇది వేరే కథ అని చెప్పుకొచ్చారు.
దర్శకుడిగా మారిన ఎడిటర్
స్పై సినిమాను గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేసారు. ఇదివరకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ, స్పై సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ సినిమాలో అభినవ్ గొమఠం కీలక పాత్రలో కనిపిస్తున్నట్టు టీజర్ తెలియజేసింది. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ను అందించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను కే. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కథను కూడా రాజశేఖర్ రెడ్డి అందిస్తుండడం విశేషం. జూన్ 29వ తేదీన స్పై సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.