కార్తికేయ 3 పై సెన్సేషనల్ అప్డేట్: కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే అంటున్న నిఖిల్
హీరో నిఖిల్ కార్తికేయ 3 సినిమాపై సెన్సేషనల్ న్యూస్ బయటపెట్టాడు. ముంబైలో జరిగిన ఓటీటీ ప్లే ఛేంజ్ మేకర్స్ అవార్డు ఫంక్షన్ లో ట్రయల్ బ్లేజర్ అవార్డు గెలుచుకున్నాడు నిఖిల్. ఈ నేపథ్యంలో మాట్లాడిన నిఖిల్, కార్తికేయ 2 సినిమా చేసినందుకు ఇంతటి గౌరవం దక్కడం సంతోషంగా ఉందని అన్నాడు. కంటెంట్ బాగుంటే ఇండియాలో ఎక్కడైనా చూస్తారని చెప్పడానికి కార్తికేయ 2 నిదర్శనంగా నిలిచిందని అన్నాడు. కార్తికేయ 2 డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, అందువల్లే హిందీలో చూసినా, తమిళంలో చూసినా ఆ ప్రాంతాల్లోనే కథ జరుగుతున్నట్లుగా అనిపిస్తుందని అన్నాడు నిఖిల్. ప్రపంచ పటంపై ఇండియన్ సినిమాను నిలిపిన రాజమౌళి, గునీత్ మోంగాలు నిజమైన ట్రయల్ బ్లేజర్లని అన్నాడు.
త్రీడీలో రానున్న కార్తికేయ 3
ప్రస్తుతం సినిమా మారిందనీ, భాషా బ్యారియర్లు కనుమరుగు అవుతున్నాయనీ, సినిమా బాగుంటే, ప్రేక్షకుడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడని మాట్లాడాడు. ఇక తన తర్వాతి సినిమాలైన కార్తికేయ3, స్పై చిత్రాల గురించి మాట్లాడుతూ, కార్తికేయ 3 త్రీడీలో రూపొందుతుందని, కార్తికేయ 2ని మించి కార్తికేయ 3 ఉండనుందని అన్నాడు. ఇకపోతే స్పై సినిమా సోషల్ ఇష్యూ ఆధారంగా తెరకెక్కుతోందని, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుందని తెలియజేసాడు. మొత్తానికి తన నెక్స్ట్ సినిమాల గురించి సాలిడ్ అప్డేట్స్ ఇచ్చాడు నిఖిల్. కార్తికేయ 2 చిత్రం ఇటు తెలుగులోనూ, హిందీలోనూ దుమ్ము దులిపింది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది.