Cocktail 2: రష్మిక-కృతి పాత్రలపై వస్తున్న ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన నటి!
ఈ వార్తాకథనం ఏంటి
కాక్‌టెయిల్ 2 చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి హోమీ అడజానియా దర్శకత్వం వహించారు. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ప్రచారంపై తాజాగా కృతి సనన్ స్పందించారు. ఈ చిత్రంలో తాను, రష్మిక స్వలింగ ప్రేమికులుగా కనిపించనున్నారనే వార్తలను ఆమె ఖండించారు. 'కాక్‌టెయిల్ 2' లెస్బియన్ లవ్‌స్టోరీ కాదని స్పష్టం చేశారు. ఇది ముగ్గురు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే భావోద్వేగ ప్రధాన కథ అని వెల్లడించారు.
వివరాలు
ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా షాహిద్ కపూర్, రష్మిక, కృతి కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కృతి ఈ రూమర్స్‌కు చెక్ పెట్టగా, ముగ్గురి మధ్య కెమిస్ట్రీ గురించి రష్మిక సరదాగా స్పందించారు. మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. థియేటర్‌లో సినిమా చూస్తే ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారు. ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారని రష్మిక తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా థియేటర్లలో సినిమా చూసి ఆస్వాదించాలని ప్రేక్షకులను కోరారు. కాగా, 2012లో విడుదలైన కాక్‌టెయిల్ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఆ చిత్రంలో దీపికా పదుకొణె, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.