LOADING...
RGV - Imaddi Ravi : రాబిన్ హుడ్ కాదు… రవి పైరసీ హీరో కాదు.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!
రాబిన్ హుడ్ కాదు… రవి పైరసీ హీరో కాదు.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

RGV - Imaddi Ravi : రాబిన్ హుడ్ కాదు… రవి పైరసీ హీరో కాదు.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

'ఐబొమ్మ' వంటి పైరసీ మూవీ వెబ్‌సైట్లపై ఇటీవల పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను చంచల్‌గూడ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నాడు. ఇక దర్యాప్తు అధికారులు రవిని ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతిని పొందారు. ఈ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ (RGV) స్పందించడం చర్చనీయాంశంగా మారింది. పైరసీ నిర్మూలనపై వచ్చిన ప్రశ్నకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Details

ఆర్జీవీ ట్వీట్ వైరల్

పైరసీ ఎప్పటికీ ఆగదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, పోలీస్ కంట్రోల్ ఎంత కఠినమైనా, సినిమాను ఫ్రీగా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఉంటారు. అలాంటి వారు ఉన్నంతకాలం, వారికి లింకులు ఇచ్చే రవి వంటి వారు కూడా ఉంటారు. కొందరు రవిని 'రాబిన్‌హుడ్‌'తో పోలుస్తున్నారు. కానీ రాబిన్‌హుడ్ అసలు హీరో కాదు. ధనవంతులను దోచుకుని పేదలకు పంచిన మొదటి టెర్రరిస్ట్‌లాంటి వాడు. ధనవంతుల 'నేరం' ఏంటంటే వారు కష్టపడి డబ్బు సంపాదించడం. దోపిడీని మహిమలు చెబుతూ దొంగను దేవుడిలా చూడడం ప్రజల అజ్ఞానం అని పేర్కొన్నారు. సినిమా టికెట్ ధరలు, పాప్‌కార్న్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో పైరసీని సమర్థించడం అత్యంత ప్రమాదకరమని ఆర్జీవీ స్పష్టం చేశారు.

Details

పైరసీ కంటెంట్ ని సరఫరా చేసే వాళ్లని నేరస్తులుగా చూడాలి

"BMW కారు ఖరీదుగా ఉందా? అందుకే షోరూమ్ దోచేయాలా? బంగారం రేటు ఎక్కువగా ఉందా? జ్యువెల్లరీ షాప్ దోచుకుని పేదలకు పంచాలా? ఇవన్నీ అసంబద్ధమైన వాదనలు. అయితే సినిమాకి మాత్రం ఆ లాజిక్ ఎందుకు వర్తించాలి?" అని ప్రశ్నించారు. పైరసీ చూడడంలో నైతికత ఏమీ ఉండదని, కేవలం సౌకర్యం మరియు ఖర్చు తగ్గడం వల్ల ప్రజలు పైరసీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పైరసీని పూర్తిగా అరికట్టాలంటే, పైరసీ కంటెంట్‌ని సరఫరా చేసే వారితో పాటు చూసే వారినీ నేరస్తులుగా చూడాలని ఆయన సూచించారు.

Details

పైరసీ చూస్తే దొంగ వస్తువులు కొన్నట్లే

"పైరేటెడ్ సినిమాలు చూసిన వారిలో 100 మందిని యాదృచ్ఛికంగా అరెస్ట్ చేసి, వారి పేర్లను పబ్లిక్‌గా ప్రకటిస్తే ఒక్కసారిగా భయం మొదలవుతుంది. అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. పైరసీ సినిమా చూడటం కూడా దొంగ వస్తువులు కొన్నట్టేనని ఆర్జీవీ అన్నారు. రవి అరెస్ట్ నేపథ్యంలో పైరసీపై జరుగుతున్న చర్చకు ఆర్జీవీ వ్యాఖ్యలు మరింత జోష్‌నిచ్చి, కొత్త డిబేట్‌కు దారితీశాయి.