అభిమాని మరణంపై ఎన్టీఆర్ సంతాపం: విచారణ జరిపించాలని కోరిన ఆర్ఆర్ఆర్ హీరో
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం మిస్టరీగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లలో రెండు రోజుల క్రితం మరణించాడు శ్యామ్. ఈ విషయమై స్పందించిన ఎన్టీఆర్, శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని, శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసాడు. అంతేకాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయాడో తెలియకపోవడం తన మనసును కలచివేస్తుందని, ప్రభుత్వ అధికారులు తక్షణమే ఈ విషయమై విచారణ జరపాలని ఎన్టీఆర్ అన్నారు. శ్యామ్ సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లాలోని కాట్రేనికోన మండలంలో కొప్పిగుంట. ప్రస్తుతం శ్యామ్ కుటుంబం తిరుపతిలో ఉంటుంది.
విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్
అయితే అమ్మమ్మ వాళ్ల ఊరు అయిన కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం మోడేకుర్రుకు శ్యామ్ వచ్చాడు. అక్కడే శ్యామ్ మరణించాడు. శ్యామ్ చేతిపై బ్లేడుతో గాయాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. శ్యామ్ మృతిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా విచారం వ్యక్తం చేసారు. తక్షణమే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. టాలీవుడ్ హీరో నిఖిల్ సైతం, న్యాయం జరగాలని ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ వేసిన ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్యామ్ మరణం వెనుక మిస్టరీని ఛేధించాలని ఎన్టీఆర్ అభిమానులు కూడా కోరుతున్నారు.