ఎన్టీఆర్ బామ్మర్ది హీరోగా సినిమా మొదలు: ప్రేమకథతో ఎంట్రీ ఇస్తున్న నార్నె నితిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు చాలామంది హీరోలు సినీ నేపథ్యం నుండి వచ్చినవారే. ఒకరో ఇద్దరో తప్పితే ఎక్కువశాతం మంది సినిమా పరిశ్రమకు చెందిన కుటుంబాల నుండి వచ్చిన వారే ఉన్నారు. ఆ వరుసలో జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ చేరిపోయారు. ఎన్టీఆర్ సతీమణి ప్రణతి సోదరుడు నార్నె నితిన్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు పూర్తయ్యాయి. పూజా కార్యక్రమాలకు అల్లు అరవింద్, దిల్ రాజు హాజరయ్యారు. అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేసారు.
రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్న చిత్రం
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తొమ్మిదవ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను అంజిబాబు కంచిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. నార్నె నితిన్ కు జంటగా నయన్ సారిక నటిస్తోంది. పల్లెటూరి ప్రేమకథతో అందరినీ ఆకట్టుకునేలా ఉండనుందని ఈ సినిమా తెరకెక్కనుందని వెల్లడించారు. ఈ చిత్రానికి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నాడు. రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్, మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. గతంలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే సినిమాను మొదలుపెట్టాడు నార్నె నితిన్. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో కొత్త సినిమాతో వచ్చేసాడు. మరి ఈ రెండింట్లో ఏ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందో చూడాలి.