Obsession: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకున్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' (Obsession) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలో అద్భుత స్పందన అందుకుని నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఎన్నో రోజులుగా ఓటీటీ విడుదలపై వార్తలు వినిపిస్తుండగా, తాజాగా ఆపిల్ టీవీ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జూన్ 30 నుంచి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. 2026లో భారత్‌లో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'అబ్సెషన్' ప్రత్యేక గుర్తింపు పొందింది.
వివరాలు
చిన్న చిత్రంగా విడుదలై..
కేవలం రూ.7 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం భారతదేశంలోనే రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయి ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
'అబ్సెషన్' కథ ఇదే..
బారోన్ అలియాస్ బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) ఓ మ్యూజిక్ స్టోర్‌లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. తన స్నేహితురాలు నిక్కీ ఫ్రీమెన్ (ఇండీ నవరెట్టే)పై అతనికి ఎంతో ప్రేమ ఉంటుంది. అయితే తన ప్రేమను వ్యక్తం చేస్తే ఆమె అంగీకరిస్తుందో లేదో అన్న భయంతో తన మనసులోని మాటను బయటపెట్టలేడు. ఒకరోజు నిక్కీ కూడా తనను ప్రేమిస్తే బాగుంటుందని ఆశపడుతూ కోరికలు తీర్చే ఓ వింత మాయా స్టిక్‌ను కొనుగోలు చేస్తాడు. ఆ స్టిక్‌ను విరగ్గొట్టి మనసులో ఏ కోరిక కోరినా అది నెరవేరుతుందని తెలుసుకున్న బేర్,"ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిక్కీ నన్నే ప్రేమించాలి"అని కోరుకుంటాడు.
వివరాలు
'అబ్సెషన్' కథ ఇదే..
ఆ కోరిక ప్రభావంతో నిక్కీ నిజంగానే బేర్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం ప్రారంభిస్తుంది. మొదట్లో తన కోరిక నెరవేరడంతో బేర్ ఆనందానికి అవధులు ఉండవు. అయితే మొదట్లో బాగున్నా, రోజులు గడిచే కొద్దీ నిక్కీ ప్రేమ హద్దులు దాటుతుంది. ఆమె ప్రవర్తన భయానకంగా మారడంతో బేర్ ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటాడు. చివరకు బేర్ కోసం నిక్కీ ఎంతవరకు వెళ్తుంది? ఈ మాయా కోరిక ఇద్దరి జీవితాలను ఎలా మార్చేస్తుంది? చివరికి వారి గమ్యం ఏమవుతుంది? అనే ఆసక్తికర అంశాల చుట్టూ 'అబ్సెషన్' కథ సాగుతుంది.