అధికారిక ప్రకటన: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి ఫిక్స్
నాగ చైతన్య కెరీర్లో 23వ సినిమాగా రూపొందుతున్న చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటించబోతుందని అనేక వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ జాయిన్ అయిందని మేకర్స్ కూడా ఒకానొక వీడియోని రిలీజ్ చేశారు. కాకపోతే అందులో హీరోయిన్ ముఖాన్ని కనబడకుండా కవర్ చేశారు. ప్రస్తుతం నాగ చైతన్య 23వ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో అధికారికంగా ప్రకటించారు.
2018లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న సినిమా
పుకార్లు వచ్చినట్టుగానే ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారు. లవ్ స్టోరీ తర్వాత మరోసారి నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించబోతున్నారు. మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. 2018 సంవత్సరంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్ళి అనుకోకుండా పాకిస్తాన్ సరిహద్దు కోస్టుగార్డులకు చిక్కారు. వీళ్లంతా ఒక సంవత్సరం పాటు పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవించారు. ప్రస్తుతం ఈ సంఘటనల ఆధారంగా నాగచైతన్య 23వ సినిమా రూపొందుతోంది. ఇప్పటివరకు స్క్రిప్ట్ పనులు పూర్తయిపోయాయని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో చిత్ర షూటింగ్ మొదలు కానుందని సమాచారం.