Oscar: ఆస్కార్ బరిలో గెలుపు ఎవరిది?.. ఉత్తమ నటుడి రేసులో ఆ హీరోలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు వేడుకలలో అకాడమీ అవార్డులు (ఆస్కార్) ముందుంటాయి. ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు తమ ప్రతిభకు ప్రపంచ వేదికపై గుర్తింపు రావాలని కోరుకునే క్షణం ఇదే. ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేడుక ఈ నెల 16న భారతీయ కాలమానం ప్రకారం జరగనుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది విడుదలైన వందల చిత్రాల్లోంచి ఉత్తమ నటుడిగా నామినేషన్ పొందిన కథానాయకులు ఎవరో చూద్దాం.
వివరాలు
మూడోసారి నామినేషన్.. ఈసారి అవార్డు దక్కుతుందా?
చిన్ననాటి నుంచి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలని కలలు కన్న తిమోతీ చాలమేట్ ప్రస్తుతం హాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందాడు. 'హోమ్‌ల్యాండ్' టీవీ సిరీస్‌తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, తరువాత 'ఇంటర్‌స్టెల్లార్' చిత్రంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. 'కాల్ మీ బై యువర్ నేమ్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రొమాంటిక్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న తిమోతీకి అదే చిత్రం తొలి ఆస్కార్ నామినేషన్ తెచ్చిపెట్టింది. అలాగే ఆస్కార్ అవార్డులు అందుకున్న 'డ్యూన్' చిత్రంలోనూ హీరోగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు 'మార్టీ సుప్రీం' సినిమాతో ఉత్తమ నటుడిగా తన కెరీర్‌లో మూడోసారి ఆస్కార్ నామినేషన్ పొందాడు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించడం విశేషం.
వివరాలు
'టైటానిక్' హీరో మరోసారి రేసులో
టీవీ ప్రకటనలతో కెరీర్ ప్రారంభించిన లియోనార్డో డికాప్రియో తర్వాత సిట్‌కామ్‌ల నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టాడు. 'వాట్స్ ఈటింగ్ గిల్బర్ట్ గ్రేప్' చిత్రంలో వైకల్యం ఉన్న బాలుడి పాత్రతో తొలి ఆస్కార్ నామినేషన్ అందుకున్నాడు. ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'టైటానిక్' సినిమాలో జాక్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆ చిత్రం ఆయనను గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టింది. కెరీర్‌లో ఎన్నో ఆస్కార్ నామినేషన్లు పొందిన డికాప్రియో, 'ది రెవనెంట్' చిత్రంతో ఉత్తమ నటుడిగా తన తొలి ఆస్కార్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' చిత్రానికి ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యాడు. దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ తెరకెక్కించిన ఈ మూవీలో మాజీ విప్లవకారుడి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
వివరాలు
ఏతాన్ హాక్‌కు మొదటి ఉత్తమ నటుడి నామినేషన్
"నా జీవితాన్ని సినిమాలకు అంకితం చేశాను. ఈ వృత్తిని ఎంతో ప్రేమిస్తున్నాను. మనందరిలోనూ ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, తన తల్లిదండ్రులు లేదా స్నేహితులు గర్వపడాలని కోరుకుంటాడు" అంటూ తన తొలి ఉత్తమ నటుడి ఆస్కార్ నామినేషన్‌పై ఆనందం వ్యక్తం చేశారు నటుడు ఏతాన్ హాక్. కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన చిత్రాలు పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు సాధించినా, నటుడిగా ఈసారి నామినేషన్ రావడం ప్రత్యేకం. ఆయన నటించిన 'బ్లూ మూన్' చిత్రంలోని పాత్రకు ఈ గౌరవం దక్కింది. అమెరికన్ గేయ రచయిత లోరెంజ్ హార్ట్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
వివరాలు
ద్విపాత్రాభినయంతో జోర్డాన్ మెరుపు
హాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ గుర్తింపు పొందిన నటుడు మైఖేల్ బీ జోర్డాన్. చిన్ననాటి నుంచి నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 'ఫ్రూట్‌వేల్ స్టేషన్' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తరువాత వచ్చిన 'క్రీడ్' చిత్రం ఆయన్ని యాక్షన్ స్టార్‌గా నిలబెట్టింది. అలాగే 'బ్లాక్ పాంథర్' సినిమాలో చేసిన విలన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు ర్యాన్ కూగ్లర్తో ఆయనకు మంచి కాంబినేషన్ ఉంది. ఇప్పుడు అదే జంటగా రూపొందిన 'సిన్నర్స్' సినిమాలో జోర్డాన్ ద్విపాత్రాభినయంతో మెప్పించాడు. పాత్రలోని అంతర్గత సంఘర్షణను అద్భుతంగా చూపించడంతో ఆస్కార్ నామినేషన్ పొందాడు.
వివరాలు
గోల్డెన్ గ్లోబ్ తర్వాత ఆస్కార్?
బ్రెజిల్ సినీ ప్రపంచం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నటుడు వాగ్నర్ మౌరా. థియేటర్‌తో ప్రారంభమైన ఆయన నటనా ప్రయాణం తరువాత సినిమాల్లో కొనసాగింది. బ్రెజిలియన్ క్లాసిక్‌గా గుర్తింపు పొందిన 'ఎలైట్ స్క్వాడ్' సినిమా ఆయనకు స్టార్ ఇమేజ్ తెచ్చింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'నార్కోస్' ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాడు. ఈ సిరీస్‌తో గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు 'ది సీక్రెట్ ఏజెంట్' చిత్రంలో చేసిన పాత్రకు మొదటిసారి ఆస్కార్ నామినేషన్ దక్కింది. రాజకీయ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో మాజీ ప్రొఫెసర్ అర్మాండో పాత్రలో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కూడా ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకోవడం విశేషం.