Ott Platforms: తెలుగు సినిమా హక్కుల ఒప్పందాలను సవరించిన Ott ప్లాట్‌ఫామ్‌లు..
ఈ వార్తాకథనం ఏంటి
ఇక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అనిపిస్తోంది.ఇప్పటివరకు సినిమాల రిలీజ్ తేదీల విషయంలోనూ,కొత్త సినిమాల ప్రకటనల విషయంలోనూ ఆధిపత్యం చెలాయించిన ఓటిటి (OTT) సంస్థలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాయి. ఇప్పటి వరకు ఓటీటీ సంస్థలు ఒక సినిమాకు ఫిక్స్‌డ్ అవుట్‌రేట్‌కే కొనుగోలు చేసేవి. అంటే, కాంబినేషన్ బట్టి లేక మరే ఇతర క్రేజ్‌నో బట్టి ఒక సినిమాకి పది కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే, ఆ పది కోట్లు కట్టాల్సిందే.. కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చి, సినిమా ఓటీటీలో విడుదల అయ్యే ముందు మిగిలిన మొత్తాన్ని చెల్లించేవారు. నిర్మాతలు కూడా ఆ విధంగా కాంటెంట్ అందించేవారు. అగ్రిమెంట్లు కూడా ఆ విధంగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ విధానం మారుతున్నట్లు సమాచారం.
వివరాలు
ఫ్లాప్ అయితే మాత్రం చెల్లింపుల్లో కటింగ్
గతంలో ఒక సినిమా ఓటీటీకి అమ్మిన తర్వాత, థియేటర్లలో ఆ సినిమా ఎలా ఆడినా సరే, ఓటీటీ సంస్థలు ముందే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించేవి. కానీ, ఇటీవల థియేటర్లలో బోల్తాపడుతున్న సినిమాల సంఖ్య పెరగడంతో, ఓటీటీ సంస్థలు ఇప్పుడు కొత్త షరతులు పెట్టడం ప్రారంభించాయి. ఇప్పుడు ఏంటంటే సినిమా హిట్ అయితేనే నిర్ణయించిన మొత్తం చెల్లిస్తామని, ఫ్లాప్ అయితే మాత్రం చెల్లింపుల్లో కటింగ్ ఉంటుందని చెబుతున్నారు. క్రేజ్ ఉన్న సినిమాలకూ ఈ విధంగానే అగ్రిమెంట్లు చేయించుకుంటున్నట్లు సమాచారం. నిజంగా ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవమో స్పష్టత లేకపోయినా, ఫిలింనగర్‌లో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సమాచారం నిజమైతే మాత్రం..నిర్మాతలకు ఇది కొత్త ఇబ్బందుల ప్రారంభం అవుతుందనే చెప్పాలి.