రానా దగ్గుబాటి, వెంకటేష్ నటించిన రానా నాయుడు రివ్యూ
అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కి రీమేక్ గా వచ్చిన రానా నాయుడు సిరీస్, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. కథ: తన ఫ్యామిలీతో ముంబైలో ఉండే రానా నాయుడు(రానా), సినిమా సెలెబ్రిటీలకు, క్రికెటర్లకు ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరిస్తాడు. రానా నాయుడు తమ్ముళ్ళు అదే ముంబైలో వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు. ఆ టైమ్ లో 15ఏళ్ల జైళ్ళో ఉండి బయటకు వస్తాడు నాగా నాయుడు(వెంకటేష్). రానా నాయుడుకు నాగా నాయుడు అంటే కోపం ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? నాగా నాయుడు జైలుకు ఎందుకు వెళ్ళాడనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది.
సిరీస్ కు హైలైట్ గా రానా, మైనస్ గా కథా కథనాలు
రానా నాయుడు సిరీస్ లో రానాకు ఎక్కువ స్కోప్ దొరికింది. ఆ పాత్రకు ఎంత కావాలో అంత ఇచ్చేసాడు. ఇక వెంకటేష్ పాత్ర అందరినీ సర్పైజ్ చేస్తుంది. ఫ్యామిలీ సినిమాలు తీస్తూ అందరికీ దగ్గరగా ఉండే వెంకటేష్, ఇందులో డిఫరెంట్ గా కనిపిస్తారు. ముఖ్యంగా వెంకటేష్ భాష.. వెంకటేష్ నుండి అలాంటి సంభాషణలను అస్సలు ఊహించలేము. వెంకటేష్ ని అభిమానించే వారికి ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. రానా భార్యగా నటించిన సుర్వీన్ చావ్లా నటన బాగుంది. నటన పరంగా అందరూ బాగానే చేసినప్పటికీ, కథా కథనాలు బలహీనంగా కనిపించాయి. సిరీస్ పూర్తవుతున్న సమయంలో ఆసక్తికరంగా కథనం వెళ్ళింది. అదే ఆసక్తి కొంచెం ముందే క్రియేట్ అయితే సిరీస్ రేంజ్ మరోలా ఉండేది.