LOADING...
Pathala Bhairavi: 'సాహసం చేయరా డింభకా'..పాతాళభైరవి క్లాసిక్‌కు 75 ఏళ్లు!

Pathala Bhairavi: 'సాహసం చేయరా డింభకా'..పాతాళభైరవి క్లాసిక్‌కు 75 ఏళ్లు!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 14, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయా పిక్చర్స్ నిర్మించిన 'పాతాళభైరవి' (1951) సినిమా విడుదలై మార్చి 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎన్నేళ్లు గడిచినా ఈ సినిమాను చూస్తే ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంది. ఆ కాలంలోనే ఈ చిత్రం ఘనవిజయం సాధించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా 28 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. కొన్ని ప్రాంతాల్లో 200 రోజుల పాటు ప్రదర్శించబడింది. తెలుగులో అంతకాలం ఆడిన మొదటి సినిమాగా కూడా ఇది గుర్తింపు పొందింది.

వివరాలు

ఎన్టీఆర్ కెరీర్‌కు మలుపు

ఇది నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) నటించిన ఆరో సినిమా. ఈ చిత్రం విజయంతో ఆయనకు హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. అప్పటికే జానపద సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటగా 'తోట రాముడు' పాత్రకు అక్కినేనినే ఎంపిక చేయాలని దర్శకుడు కె.వి. రెడ్డి భావించారు. అలాగే మాంత్రికుడి పాత్రకు ముక్కామల లేదా గోవిందరాజుల సుబ్బారావును తీసుకోవాలనుకున్నారు. ఒక రోజు 'సంసారం' సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్‌ను చూసిన కె.వి. రెడ్డికి ఆయన రూపం తోట రాముడి పాత్రకు బాగా సరిపోతుందని అనిపించింది. ఒక సన్నివేశంలో ఆయన కళ్లలో కనిపించిన తీక్షణత దర్శకుడిని ఆకట్టుకుంది. సాహసం, అమాయకత్వం రెండూ కలిసిన ఆ పాత్రకు ఎన్టీఆర్ సరైన ఎంపికగా భావించి ఆయనను ఫైనల్ చేశారు.

వివరాలు

పాత్రలకు ప్రాణం పోసిన నటులు

మాంత్రికుడి పాత్రకు అప్పట్లో పెద్దగా ఇమేజ్ లేని ఎస్.వి. రంగారావును తీసుకోవాలని నిర్ణయించారు. 'పాతాళభైరవి'తో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. విజయ ప్రొడక్షన్స్‌తో ఉన్న నాలుగు సినిమాల ఒప్పందంలో భాగంగా ఆయనకు ఈ అవకాశం వచ్చింది. అక్కినేని ఇప్పటికే స్టార్ అయినప్పటికీ, జానపద వీరుడైన తోట రాముడు పాత్ర మాత్రం ఎన్టీఆర్‌కే ప్రత్యేకంగా సరిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ సినిమాకు కథను పింగళి నాగేంద్రరావు రచించారు. 'కాశీమజిలీ కథలు' స్ఫూర్తిగా తీసుకుని కథ రూపొందింది. విడుదలైన వెంటనే ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసే సినిమాగా మారింది. ఆ కాలంలో సాంకేతిక సదుపాయాలు తక్కువగా ఉన్నప్పటికీ, సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లే చూపిన ప్రతిభ ప్రత్యేకంగా నిలిచింది.

Advertisement

వివరాలు

మేకప్‌లకే గంటల సమయం..

గ్రాఫిక్స్ లేకుండానే లెన్స్‌లు, లైటింగ్‌, ట్రిక్ ఫోటోగ్రఫీ సహాయంతో మాయల ఫకీరు గుహ, పాతాళభైరవి విగ్రహం వంటి సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. తోట రాముడు పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా మాయల ఫకీరు తనను బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సన్నివేశాల్లో అమాయకత్వం చూపించేందుకు ప్రత్యేకంగా సాధన చేశారు. 'నేపాళ మాంత్రికుడు' పాత్రలో ఎస్.వి. రంగారావు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన మేకప్‌కు గంటల సమయం పట్టేది. గడ్డం, ప్రత్యేక దుస్తులు ఆ పాత్రకు ప్రత్యేక గాంభీర్యం తీసుకొచ్చాయి. అలాగే ఆయన చెప్పిన "సాహసం చేయరా డింభకా" అనే డైలాగ్ తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది.

Advertisement

వివరాలు

ఘంటసాల సంగీత మాధుర్యం

'పాతాళభైరవి'ని అప్పట్లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. రెండు భాషల్లోనూ ఎన్టీఆరే హీరోగా నటించారు. తెలుగులో మార్చి 15న విడుదల కాగా, తమిళంలో మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఘంటసాల స్వరాలు మరింత అందం తీసుకొచ్చాయి. 'కలవరమాయే మదిలో', 'ప్రేమకోసం వలలో పడెనే పాపం పసివాడు', 'వినవే బాలా నా ప్రేమ గోలా', 'వగలోయ్ వగలు' వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.

వివరాలు

వినోదానికి చిరునామా..!

ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మాలతి..ఆ తరువాత కాలంలో ఎన్టీఆర్ సినిమాల్లో తల్లి పాత్రలు చేశారు. రేలంగి పోషించిన రాజుగారి బావమరిది పాత్ర కూడా ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతి తెలివి ప్రదర్శించే సరదా విలన్ తరహా ఆ పాత్ర ప్రేక్షకులకు విపరీతమైన నవ్వులు పంచింది. అందుకే ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని క్లాసిక్‌గా 'పాతాళభైరవి' ఇప్పటికీ నిలిచింది.

Advertisement