
ఆర్థిక ఇబ్బందులతో ఆకలి బాధల్లో పావలా శ్యామల.. ఆత్మహత్యే శరణ్యం అంటున్న సీనియర్ నటి
ఈ వార్తాకథనం ఏంటి
తన నటనతో, హాస్యంతో నవ్వుల పువ్వులు పూయించిన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది.
నటిగా వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు.
పావలా శ్యామల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అటు ఆర్థిక సమస్యలు, ఇటు ఆరోగ్య సమస్యలు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
వయోభారం వల్ల అనారోగ్య సమస్యలతో పావలా శ్యామల ఇబ్బంది పడుతుంటే, అనారోగ్యం కారణంగా తన కూతురు కూడా మంచానికే పరిమితం కావడం ఆమెను మరింత వేదనకు గురిచేస్తోంది.
పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదిగూడలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నారు.
Details
గతంలోనూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న పావలా శ్యామల
ఆశ్రమంలో ఉండడానికి కావాల్సిన డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో పావలా శ్యామల తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.
గతంలో కూడా పావలా శ్యామల చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయాల్లో సినిమాల్లో నటనకు గాను తనకు వచ్చిన అవార్డులను అమ్ముకుని బియ్యం, పప్పు మొదలగు సరుకులను తెచ్చుకుని కడుపు నింపుకున్నారు.
మరో విషయం ఏంటంటే, గతంలో పావలా శ్యామల పరిస్థితిని చూసి చాలామంది ఆర్థికంగా సాయం చేశారు. కాకపోతే అవి కేవలం తాత్కాలికంగా ఉపశమనాన్ని అందించాయి.
ప్రస్తుతం తనకు సాయం అందించాలని పావలా శ్యామలా కోరుతున్నారు.